చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్ల వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం దూసుకుపోతోంది. పేలుళ్లకు రెండురోజుల ముందు పట్టుపడిన తీవ్రవాది జాకీర్ హుస్సేన్‌ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, 9 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నై నగరంలో తీవ్రవాదుల కదలికలున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇటీవల భారీ ఎత్తున తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గత నెల 29న మన్నాడీ అనే ప్రాంతంలో జాకీర్‌హుస్సేన్ పట్టుబడ్డాడు. ఇతని నుంచి సేకరించిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను 30న అరెస్ట్ చేశారు. వీరందరినీ అరెస్ట్ చేసిన మరుసటి రోజే అంటే ఈనెల 1న సెంట్రల్‌లో జంటపేలుళ్లు సంభవించాయి. అరెస్టులకు ప్రతీకారంగానే పేలుళ్లు జరిపి ఉంటారని తొలుత భావించినా పట్టుపడిన వారి లక్ష్యాలు వేరని పోలీసులు గుర్తించారు. శ్రీలంకలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ గూడచారి హోదాలో జాకీర్ హుస్సేన్ చెన్నైలో అడుగుపెట్టినట్లు, ఈ సమయంలో తిరుచ్చి, బెంగళూరులలో పర్యటించినట్లు కనుగొన్నారు.
చెన్నైలోని అమెరికా దౌత్యకార్యాలయం, బెంగళూరులోని ఇజ్రారుుల్ దౌత్యకార్యాలయం పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లు తెలుసుకున్నారు. ఈ విధ్వంసాలను అమలుచేసేందుకు మాల్దీవుల నుంచి వచ్చే ఇద్దరి వ్యక్తులకు నివాస, వసతి సౌకర్యాలను సమకూర్చే బాధ్యతలను జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పనిలో ఉండగానే అతను పోలీసులకు పట్టుబడ్డాడు. ముఖానికి ముసుగు ధరింపజేసి భారీ బందోబస్తు మధ్య పోలీసులు చెన్నై ఎగ్మూరు కోర్టుకు జాకీర్‌హుస్సేన్‌ను తీసుకువచ్చారు. జాకీర్ హుస్సేన్ కార్యకలాపాలపై విచారణ జరిపేందుకు పదిరోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా క్యూ బ్రాంచ్‌పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే 9 రోజులకు న్యాయమూర్తి అనుమతించారు. దీంతో వెంటనే అదే స్థితిలో కోర్టు బైటకు తీసుకువచ్చిన జాకీర్‌హుస్సేన్‌ను విచారణ నిమిత్తం రహస్య ప్రదేశానికి తరలించారు.
సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుళ్లకు కుట్ర బెంగళూరులోనే జరిగినట్లు తెలుస్తున్నందున ఆ కోణంలో రెండోదశ విచారణను సోమవారం ప్రారంభించారు. చెన్నై-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య సెల్‌ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నారు. బాంబులు అమర్చిన అనంతరం సెల్‌ఫోన్‌లో ముష్కరులు చర్చించుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 358 కిలోమీటర్ల దూరం వరకు జరిగిన అన్ని సంభాషణల టేపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌లో పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులే కారణమని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. అయితే వీరితో అల్‌ఉమ్మా తీవ్రవాదులు కూడా చేతులు కలిపి జాయింట్ ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అందుకే అలాగే వేలూరు జైలులో శిక్ష ను అనుభిస్తున్న ఆల్ ఉమ్మా తీవ్రవాదులు పన్నా ఇస్మాయిల్, పోలీస్ ఫక్రుద్దీన్, బిలాల్‌మాలిక్‌లను విచారిస్తున్నారు.
పోలీస్ కస్టడీకి జాకీర్ హుస్సేన్
Published Mon, May 5 2014 11:25 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
Advertisement
Advertisement