
ఉన్న పరిశ్రమలు కాపాడుకోండి!
విదేశాలు సంచరిస్తూ కొత్త పరిశ్రమల కోసం ఆరాట పడుతున్న ముఖ్యమంత్రి...
- సీఎం ఫడ్నవీస్ విదేశీ పర్యటనపై రాధాకృష్ణ విఖే విమర్శ
- పరిశ్రమలు గుజరాత్‌కు తరలిపోతున్నాయని వెల్లడి
- శివసేనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా
షోలాపూర్: విదేశాలు సంచరిస్తూ కొత్త పరిశ్రమల కోసం ఆరాట పడుతున్న ముఖ్యమంత్రి.. ఉన్న సంస్థలను చేజారి పోకుండా చూసుకుంటే మంచిదని శాసన మండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖేపాటిల్ దుయ్యబట్టారు. షోలాపూర్ శ్రామిక పత్రకార్ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు పరిశ్రమలు గుజరాత్‌కు తరలిపోతున్నాయని, వాటిని ఆపి కొత్త వాటి గురించి ఆలోచించమని సీఎంకు సూచించారు. రాష్ట్రంలోని మెటల్ ఇండస్ట్రీ గుజరాత్‌కు తరలిపోవడానికి సిద్ధంగా ఉందని, ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని తరచూ ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారని, 1965, 1971 యుద్ధాల్లో గెలుపును ఘట్టాలు ఆయన మరిచిపోయి ఉంటారని విమర్శించారు.
విదేశాలకు వెళ్లి ప్రధాని భారతదేశం పరువు తీస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై నమ్మకం లేదని విమర్శించారు. అందుకే విదేశీ పర్యటనలకు తనే వెళుతూ విదేశాంగ శాఖను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాదయినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీ కార్యకర్తలే నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక శివసేనకు సరైన నేతృత్వం లేదన్నారు. ‘జైతాపూర్ సమస్యపై వారు పోరాటం సాగిస్తున్నారు. కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొనసాగుతున్నారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు’ అని పాటిల్ విమర్శించారు.