సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం క్లాస్ తీసుకున్నారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో సోమవారం జరిగిన కేపీసీసీ ఎస్‌సీ, ఎస్‌టీ విభాగం సమావేశంలో తారస పడిన ఆంజనేయను చూసిన సీఎం తొలుత అసహనం వ్యక్తం చేశారు. విధాన సౌధలోని తన కార్యాలయం కోసం కేటాయించిన రెండు గదుల మధ్య ఉన్న గోడను ఆంజనేయ పట్టుబట్టి కూల్చి వేయించారు. దీనిపై కొంత వివాదం నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం ఆయనను సుతిమెత్తగా మందలించారు.
గోడ కొట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా శాఖా పరమైన పనులను పూర్తి చేయాలని సూచించారు. కాగా విధాన సౌధలో 340, 340ఏ గదులను ఆంజనేయకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ రెండు గదుల మధ్య గోడను కూల్చాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్ అడ్ బీ)ను ఆదేశించిన మంత్రి, అప్పటి వరకు వేరే గదిలో తాత్కాలింగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొన్న మంత్రి వర్గంలో చేరిన విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తనకూ అదే 340 గది కావాలని పట్టుబట్టారు.
దీనిపై ఆంజనేయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గోడ కొట్టే పనులను త్వరగా పూర్తి చేయనందుకు ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు కొట్టకపోతే నేనే దగ్గరుండి కూల్చి వేయిస్తా, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తా’ అని అధికారులను కస్సు బుస్సుమంటూనే పరోక్షంగా శివకుమార్‌పై చిందులేశారు. అయితే ప్యాలెస్ మైదానంలో సమావేశం సందర్భంగా వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని చిరు నవ్వులు చిందించారు. కాంగ్రెస్ మార్కు రాజకీయమంటే ఇదేనేమో...!
మంత్రి ఆంజనేయకు సీఎం క్లాస్
Published Tue, Jan 7 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement