రాష్ట్రానికి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కావాలి
బెంగళూరు : రైతులు, శ్రామికులు, చిన్నస్థాయి ఉద్యోగులు.... ఇలా సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజల కష్టాలకు స్పందించి వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి అవసరం ప్రస్తుతం కర్ణాటకకు ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ అభిప్రాయపడ్డారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కెంగేరి ఉపనగరలో యశ్వంత్‌పుర నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల బృహత్ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవెగౌడ మాట్లాడుతూ... ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. దేశానికి వెన్నముకలాంటి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 213 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందడం లేదని తెలిపారు.
గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్లె నిద్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం వల్ల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలను చూపెట్టేవారని గుర్తు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిద్ధరామయ్య వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే రైతుల బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పార్టీలోని కొంతమంది నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా బీబీఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలన్నారు. అప్పుడు మాత్రమే మెజారిటీ సీట్లు సాధించడానికి వీలవుతుందని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్టు కేటాయిస్తామని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, శాసనమండలి సభ్యుడు ఈ.కృష్ణప్పతోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు జేడీఎస్ నేతలు హాజరయ్యారు.