ఆ రొమాన్స్‌పై కలత చెందిన హన్సిక
మిగామన్ చిత్రంలోని ఒక పాటలో నటించడానికి నటి హన్సిక కలత చెందిన విషయం నిజమేనన్నారు. ఆ చిత్ర దర్శకుడు మగిళ్ తిరుమేణి ఇంతకు ముందు మున్‌దినం పార్తేన్ చిత్రంలో ప్రేమను, ఆ తరువాత తడైయారు తాక్క చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను వైవిధ్యంగా తెరకెక్కించిన ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిగామన్. ఈ చిత్రంలో నటుడు ఆర్యను రెండు కోణాల్లో చూపిస్తున్న ఈ దర్శకుడితో చిట్‌చాట్.
చిత్రానికి మిగామన్ అంటూ అచ్చ తమిళ భాషలో పేరు పెట్టారు. మీ గురువు గౌతమ్ మీనన్ బాణీని అనుసరిస్తున్నారా?
నేను తెరకెక్కిస్తుంది తమిళ చిత్రమే కదండీ. అప్పుడు తమిళ భాషలోనే కదా పేరు పెట్టాలి.
చిత్రంలో ఆర్య పాత్ర ఏంటి?
ఆర్య ఓడకు కెప్టెన్ కాకపోయినా ఈ చిత్రం కథ సముద్ర నేపథ్యంలోనే సాగుతుంది. కొన్ని ప్రధాన విషయాల్లో మార్గదర్శకత్వం వహించే వారిని కెప్టెన్ అంటారు. కొన్ని సంఘటనలను ఎదుర్కొని నిలబడే సామర్థ్యం శత్రువులను గెలిచే ధైర్యం గల పాత్రలో ఆర్య నటిస్తున్నారు.
లవర్‌బాయ్ ఇమేజ్ గల ఆర్యపై ఇంత బరువు మోపడానికి కారణం?
ఆర్యను నేను తొలి రోజుల నుంచి సుదీర్ఘంగా గమనిస్తున్నాను. ఆయనకు లవర్‌బాయ్ ఇమేజ్ రావడానికి మీడియా ఒక కారణం. చాలామంది హీరోయిన్లు ఆర్యతో సన్నిహితంగా ఉండడానికి ఆయన ప్రవర్తన కారణం. ఆయన అనవసరంగా ఏదీ మాట్లాడరు. చేయరు. అందుకే హీరోయిన్లు ఆయన సాన్నిహిత్యాన్ని సేఫ్‌గా భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్యను ఖచ్చితంగా వేరే కోణంలో చూస్తారు.
చిత్రం హీరోయిన్‌గా హన్సికను ఎంపిక చేయడానికి కారణం?
నిజం చెప్పాలంటే హన్సిక ఎంపిక నిర్మాతల చాయిసే. అయితే చిత్రం చూసిన తరువాత ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమె కరెక్ట్ అంటారు. మరో నటిని ఊహించలేదు. చిత్రంలో తన పాత్రకు ఏమేమి కావాలో దాన్ని హన్సిక బ్రహ్మాండంగా చేశారు.
చిత్రంలో ఆర్యతో సన్నిహితంగా నటించడానికి హన్సిక ఏడ్చేశారట?
హన్సిక చాలా ధైర్యం గల నటి. ఆమె ఏడ్చారన్నది అవాస్తవ ప్రచారం. అయితే ఒక్క విషయంలో ఆమె కొంచెం కలత చెందారు. ఆ సంఘటన చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ప్రేమ అనేది పలు పరిణామాలతో కూడుకున్నది. అందులో ఒకటి శారీరక సంబంధం. అలాంటి బంధం గురించి గీత రచయిత కార్గిని ఒక పాట రాయమని కోరాను. ఆయన చాలా రొమాంటిక్ పాటను రాశారు. ఆ పాటలో ఆర్యతో నటించడానికి తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని కలత చెందారు. అయితే ఇలా నటించడం వల్ల మీ ఇమేజ్‌కు ఎలాంటి ముప్పు ఉండదని వివరించడంతో ఆమె మరో ఆలోచన లేకుండా నటించారు.
మీ చిత్రాలకు వరుసగా తమన్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడానికి కారణం?
తమన్ తన స్నేహితుడన్న విషయం పక్కన పెడితే ఆయన మంచి సంగీత దర్శకుడు. ఇక్కడే ఆయనకు తక్కువ గౌరవాన్నే ఇస్తున్నాం గానీ తెలుగులో తమన్ ప్రముఖ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్నారు. నాకేమి కావాలో దాన్ని శోధించి అందిస్తున్నారు. అంత శ్రమను వేరొకరి నుంచి ఆశించలేను.
అయినా చిత్రంలో రెండున్నర పాటలు చోటు చేసుకుంటాయట?
నిజమే చిత్రంలో రెండు పూర్తి పాటలు ఒక చిన్న పాట ఉంటాయి. నేనెప్పుడూ చిత్ర కథనానికి ప్రాముఖ్యత నిస్తాను. ఈ చిత్ర కథకు ఈ పాటలు సరిపోతాయి.