
క్లీన్ బెంగళూరు
* ఆరు నెలల్లో చెత్తరహిత నగరంగా ఉద్యాన నగరి
* త్వరలో మధ్యతరగతి వారికి బీడీఏ ద్వారా సొంతిళ్లు
* అందుకోసం 24 వినూత్న పథకాలు
* 30 వేల ఇళ్లను నిర్మిస్తామని మాట తప్పిన బీజేపీ
* ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : ఆరు నెలల్లోపు చెత్త రహిత నగరంగా బెంగళూరును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధచేసినట్లు తెలిపారు. స్థానిక రాజరాజేశ్వరి నగరలోని ఐడీఎల్ హోమ్స్ సహకార సంస్థ సువర్ణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మంది ఉద్యోగ, ఉపాధి కోసం వలస వస్తున్నారన్నారు. నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో చెత్త సమస్య కూడా పెరిగిందన్నారు.
ఈ విషయమై దేశ విదేశాల్లో గార్డన్‌సిటీగా పేరున్న బెంగళూరును గార్బేజ్ సిటీగా కొందరు వ్యంగమాడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే నగర శివారులో చెత్త సంస్కరణ ఘటకాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలను గుర్తించామన్నారు. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లోపు బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మండూరులో చెత్తను డంపింగ్ చేయడాన్ని ఇప్పటికే నిలిపివేశామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.
బెంగళూరులో సొంత ఇళ్లు కలిగి ఉండాలనే మధ్యతరగతి ప్రజల కలను తీర్చడానికి వీలుగా మూడేళ్లలో బెంగళూరు డెవెలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) నుంచి 12,610 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అందుకోసం 24 వినూత్న పథకాలను అమలు చేస్తామన్నారు. ఇందులో ఇప్పటికే ఐదు పథకాలు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటినీ విడతల వారిగా పూర్తి చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ అవధి కాలంలో బీడీఏ ద్వారా 30 వేల ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు.. ఒక్క ఇంటిని కూడా ప్రజలకు ఇవ్వలేదని విమర్శించారు.
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడంతో సహకార సంస్థల పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, మహదేవ ప్రసాద్, శాసనసభ్యులు సోమశేఖర, మునిరత్న, ఐడీఎల్ సహకార సంస్థ అధ్యక్షుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.