
దివ్య దర్శనం పథకాన్ని ప్రారంభించిన సీఎం
విజయవాడ: వివిధ ఆలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా అందే ఆదాయంతో నిరుపేదలకు ఉచిత తిరుమల దర్శనం కల్పించే దివ్యదర్శనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ పథకంలో ఒక్కో మండలం నుంచి ఒకే విడతలో 200 మంది చొప్పున రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని భక్తులకు ఉచిత తిరుమల దర్శన భాగ్యం కల్పిస్తారు.
విజయవాడ నగర, రూరల్ మండలానికి చెందిన 167 మంది భక్తులతో బయలుదేరే బస్సులను ముఖ్యమంత్రి దుర్గ గుడి సమీపంలోని దుర్గాఘాట్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. భక్తులతో బస్సులు తిరుమలకు బయలుదేరాయి. తొలిరోజు ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ దర్శనంతో యాత్ర మొదలైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకుంటారు. రెండోరోజు తిరుచానూరు అమ్మవారి దర్శనానంతరం తిరుమలకు చేరుకుంటారు. మూడవ రోజు ఒంటిమిట్ట ఆలయంతో పాటు శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుంటారు. నాల్గవ రోజు త్రిపురాంతకం ఆలయ దర్శనం చేసుకుని విజయవాడకు చేరుకుంటారని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు.