అమ్మ ఎక్కడ?
ఫ్లెక్సీలతో ఆహ్వానం
సచివాలయ
మార్గంలో హోరు
కానరాని కాన్వాయ్
ఎదురు చూపుల్లో అభిమానులు
కొంతకాలంగా సచివాలయానికి దూరంగా ఉన్న అమ్మ సోమవారం వస్తున్నారన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు, అభిమానులు పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కానీ అమ్మ కాన్వాయ్ కానరాలేదు. అభిమానులకు ఎదురుచూపులే మిగిలాయి. అమ్మ ఎక్కడ ఉందో.. ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన మిగిలింది.
సాక్షి,చెన్నై :సీఎం జే.జయలలిత ఇటీవల సచివాలయానికి వారంలో రెండు రోజులు మాత్రమే వస్తూవచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపి గంటల వ్యవధిలో మళ్లీ పోయేస్ గార్డెన్‌కు వెళ్లేవారు. ఈ పరిస్థితుల్లో ఈనెల ఒకటో తేదీన ఆమె కొడనాడుకు విశ్రాంతి నిమిత్తం వెళ్తారన్న సంకేతాలు వచ్చాయి. ఆ కార్యక్రమం రద్దయ్యింది. గత తొమ్మిది రోజులుగా సచివాలయానికి ముఖ్యమంత్రి జయలలిత రాలేదు. అన్ని వ్యవహారాలను ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తాజాగా సీఎం జయలలిత ఉన్నా, మంత్రులు ప్రకటనలు విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం కొన్ని ప్రతి పక్ష పార్టీల నాయకులు సీఎం ఆరోగ్యంపై బహిర్గతం చేయాలంటూ అనుమానాలు లేవదీశారు. సీఎం జయలలితకు ఏమయ్యిందోనన్న చర్చ బయలుదేరింది. ఈ ప్రచారానికి ముగింపు పలికే రీతిలో సీఎం జయలలిత సచివాలయానికి రాబోతున్నారన్న సమాచారం సోమవారం ఉదయాన్నే వెలువడింది.
ఎదురు చూపులే: అమ్మ సచివాలయానికి రాబోతున్నారంటూ ఉదయాన్నే ఆ మార్గంలో పోస్టర్లు వెలిశాయి. జయలలితకు ఆహ్వానం పలుకుతూ ఈ పోస్టర్లు వెలవడడం విశేషం. అమ్మావందాచ్చా...అమ్మా వందాచ్చీ..(అమ్మ వచ్చారా...అమ్మ వచ్చిందా..) అన్న ఎదురు చూపులు పెరిగాయి. మధ్యాహ్నం పలు కార్యక్రమాలను సచివాలయం నుంచి సీఎం జయలలిత శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యా శాఖ తరపున ఉద్యోగ నియామకాలు, టీఎన్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగ నియామక ఉత్తర్వులతో పాటుగా పలు కార్యక్రమాలు సాగనున్నడంతో మీడియా సైతం సచివాలయానికి ముందుగానే చేరుకుంది. ఎంత సేపు ఎదురు చూసినా అమ్మ కాన్వాయ్‌జాడ మాత్రం కాన రాలేదు. చివరకు అమ్మ కార్యక్రమాలు రద్దయినట్టు సంకేతాలువెలువడడంతో విస్తుపోవాల్సి వచ్చింది.