న్యూఢిల్లీ:కామన్వెల్త్ అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించి, నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన మంత్రుల బృందం మొద్దునిద్ర పోతోంది. 2011 నుంచి ఇప్పటిదాకా ఏడాదికోసారి చొప్పున నాలుగుసార్లు మాత్రమే సమావేశమైంది. అయినప్పటికీ ఇంకా తుది నివేదికను రూపొందించలేకపోయింది. 2011, ఆగస్టు 2న రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో మంత్రుల బృందానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. కాగ్ చీఫ్ వి.కె. షుంగ్లూ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన ఆరు నివేదికలపై నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి కార్యాలయానికి తుది నివేదికను మూడు నెలల్లో పంపే బాధ్యతను ఈ బృందానికి అప్పగించారు.
నిజానికి షుంగ్లూ కమిటీ సమర్పించిన నివేదికలపై మూడు నెలల్లో ప్రధాని కార్యాలయానికి తుది నివేదిక సమర్పించాలి. అయితే మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరంలోకి ఈ మంత్రుల బృందం అడుగుపెట్టినా ఇంకా ప్రధాని కార్యాలయానికి ఎటువంటి నివేదిక అందలేదు. ఇప్పటికీ మంత్రుల బృందం తుది నివేదికను రూపొందించలేదనే విషయం సమాచార హక్కు చట్టంతో బట్టబయలైంది. ఆగస్టు 16, 2011లో తొలిసారి జీవోఎం సమావేశం కాగా ఆ తర్వాత సెప్టెంబర్ 6, 2011న మరోసారి, అదే నెలలో 27న మూడోసారి సమావేశమైంది. ఇక చివరగా 2012, జనవరి 16న సమావేశమైన జీవోఎం మళ్లీ ఇప్పటిదాకా ఈ అక్రమాల ఊసే ఎత్తడంలేదు. గడువు ముగిసిపోతుండడంతో పదే పదే జీవోఎం సమర్పించాల్సిన నివేదిక తేదీని పొడిగిస్తూ వచ్చారు.
చివరగా జూలై 17, 2012 నాటికి సమర్పించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా సదరు తేదీకి కూడా ఎటువంటి నివేదిక ప్రధాని కార్యాలయానికి చేరలేదు. దీంతో నివేదికకు ఎటువంటి గడువు లేకుండా ఎప్పుడైనా సమర్పించవచ్చనే ఆదేశాలు తుదకు జారీ అయ్యాయి. అప్పగించిన బాధ్యత ముగిసేవరకు జీవోఎం కొనసాగుతుందని పీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే మంత్రుల బృందంలో జరిగిన చర్చల వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించేందుకు ప్రభుత్వం తిరస్కరించింది. మంత్రుల బృందం పని ఇంకా పూర్తి కాలేదని, ఈ స్థితిలో ఎటువంటి వివరాలు వెల్లడించలేమని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అంతేకాక మంత్రుల బృందం మళ్లీ ఎప్పుడు సమావేశమవుతందనే విషయంపై కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
మంత్రుల బృందం మొద్దు నిద్ర!
Published Mon, Apr 28 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM
Advertisement
Advertisement