ఫ్లెక్సీలపై ఫిర్యాదు
Published Thu, Sep 19 2013 2:36 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను వ్యతిరేకిస్తూ మంత్రి వలర్మతి, మేయర్ సైదై దురైస్వామిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.
సాక్షి, చెన్నై: ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలతో చెన్నైలో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించాలన్నా, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. కార్యక్రమం జరిగే మూడు రోజులకు ముందు, తర్వాత మూడు రోజుల వరకు వాటిని ఉంచుకోవచ్చు. తర్వాత వాటిని తొలగించని పక్షంలో కఠిన చర్యలు తప్పవు. సంబంధిత వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. అలాగే ఫుట్‌పాత్‌లు, రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీలులేదు. ఇక గోడ పెయింటింగ్ ప్రచారాలకు అడ్డుకట్ట వేశారు.
ఇష్టారాజ్యం: నిబంధనలు ఇతరులకే అన్నట్లు అధికార పక్షం నేతలు వ్యవహరిస్తున్నారు. ఎక్కడంటే అక్కడ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ పోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా అధికార పక్షం నేతలపై కేసుల నమోదుకు పోలీ సులు సాహసించడం లేదు. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. వారం రోజులుగా మెరీనా తీరం మార్గాల్లో ఇష్టారాజ్యంగా వెలసిన అధికార పక్షం ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఫుట్‌పాత్‌లను సైతం ఆక్రమించడంతో నడక గగనంగా మారింది.
రంగంలోకి రామస్వామి..
మెరీనా తీరం మార్గాల్లో, ఇతర ప్రాంతాల్లోని ఫ్లెక్సీలు, కటౌట్ల మీద సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి కన్నెర్ర చేశారు. వీటిని కెమెరాల్లో బంధించారు. ప్రజల ఇబ్బందులను ఎత్తిచూపుతూ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌ను విచారించి సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకోవాలని కోరారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది.
Advertisement
Advertisement