- దేశంలోనే తొలిసారి
- పారదర్శకత కోసం
- సీనియారిటీ ఆధారంగా ఎల్‌ఓసీలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖలో పారదర్శకతను పాటించడానికి, అవినీతిని అంతమొందించడానికి దేశంలోనే తొలి సారిగా రహదార్ల సమాచార వ్యవస్థను ప్రవేశ పెట్టనున్నట్లు ఆ శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప తెలిపారు. శాసన సభలో తన శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. ఆర్ అండ్ బీలో రహదారుల నిర్మాణం లేదా పనుల ప్రగతిపై ఎలాంటి సమాచారం ఉండడం లేదన్నారు. ఎంత ఖర్చవుతున్నదనే విషయం కూడా తెలియడం లేదన్నారు.
ఇకమీదట రాష్ట్రంలోని అన్ని రహదారుల పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతామని వెల్లడించారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారా, అనవసర పనులేమైనా జరుగుతున్నాయా లాంటి సమాచారం ఈ వెబ్‌సైట్ ద్వారా లభిస్తుందని వివరించారు. దీని ఆధారంగా రహదారులను అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అనవసరంగా రహదారుల పనులను చేపట్టి, బిల్లులు చేసుకోవడం లాంటి అవకతవకలను కూడా నివారించవచ్చని తెలిపారు.
కాగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లలో పలుకుబడి కలిగిన వారు త్వరగా బిల్లు మొత్తాలు పొందుతున్నారని తెలిపారు. దీనిని నివారించడానికి సీనియారిటీ ఆధారంగా ఎల్‌ఓసీలను ఇచ్చే పద్ధతిని పాటించనున్నట్లు వెల్లడించారు. గతంలో పథకం అంచనాలను ఒకే వ్యక్తి రూపొందించే వారని, ఇప్పుడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆ కమిటీల ఆమోదంతోనే ఇకమీదట ఎలాంటి పథకాన్నైనా చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. రూ.5 కోట్లకు వరకు సూపరింటెండెంట్ ఇంజనీర్, అంతకు మించితే చీఫ్ ఇంజనీర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు పనులను పరిశీలిస్తాయని ఆయన తెలిపారు.