- డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్న పరమేశ్వర
- సీఎంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి
- ఆ పదవి ఏర్పాటును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న సిద్ధు
- తన పరిధిలో లేదంటూ సెలైంట్
- పట్టువీడని పరమేశ్వర
- మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్‌లో శీతల సమరం ఉధృతమవుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలోనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనుకుంటున్న తరుణంలో, పరమేశ్వర ఇప్పటి నుంచే తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
అయితే ఆయన అనుకున్నట్లుగా సీఎం స్పందించడం లేదు. అన్నిటికీ ఆయన అధిష్టానం వైపు చూపిస్తున్నారు. ‘నాదేముంది. ఏదైనా అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి’ అని పదే పదే ఆయన చెబుతుండడం పరమేశ్వరకు కంపరం పుట్టిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం తొమ్మిది మందే గెలవడంతో అధిష్టానం వద్ద సీఎం పలుకుబడి తగ్గుతుందని పరమేశ్వర అంచనా వేశారు. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఇన్ని స్థానాలు గెలవలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి.
కనుక సిద్ధరామయ్యే కొంత నయమని అధిష్టానం అంచనాకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవిని సీఎం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల రెండు అధికార కేంద్రాలు ఏర్పడుతాయని, తద్వారా ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోతారని భావిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లోని పాత తరం వారంతా సిద్ధరామయ్యను అంత సులభంగా కలుసుకోలేక పోతున్నారు. సీఎం పూర్వాశ్రమంలో జనతా పరివార్‌కు చెందిన వారు. ఆ పరివార్‌లో ఉన్న మంత్రులకే ఆయన విలువ ఇస్తున్నారని ఆరోపణలున్నాయి.
దీనికి విరుగుడుగాా ఆది నుంచీ కాంగ్రెస్‌లో ఉంటున్న వారు పరమేశ్వరకు మంత్రి వర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బహుశా వచ్చే నెలలో జరుగనున్న శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల వరకు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేదు. పునర్వ్యవస్థీకరణ వాయిదా పడే కొద్దీ మంచిదనే అభిప్రాయం సీఎంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడినందున, సీఎంను ఆదేశించే స్థితిలో లేదు.