సాక్షి, బళ్లారి : కక్షసాధింపు రాజకీయాలు చేస్తూ, ప్రతిపక్షాలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఉప ఎన్నికల్లో ఒక్కటైన బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పార్టీలకు అంతర్గతంగా తాము మద్దతిస్తున్నట్లు బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములు తెలిపారు. ఆయన గురువారం నగరంలోని ఎస్‌పీ సర్కిల్‌వద్ద బీఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లోను ఆ పార్టీ వ్యతిరేకులపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందన్నారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఉప ఎన్నికల్లో జతకట్టిన జేడీఎస్, కేజేపీ, బీజేపీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒకటిగా ఉంటూ, ఆ పార్టీని అణగదొక్కాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారం లేక విలవిలలాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికార దాహం తీర్చుకునేందుకు ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చారని, అయితే ఆయ హామీలు తీర్చేందుకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే పలు అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు ఆశించారని, అయితే ఆ మేరకు పనులు జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం మవుతోందన్నారు.
రాష్ట్రంలో ఉత్తమ వ్యక్తులపై లేనిపోని ఆరోపణలు చేయడంతోపాటు బీజేపీ నుంచి విడిపోయి కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు స్థాపించడం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పొత్తుతో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటంలేదన్నారు. బీఎస్‌ఆర్‌సీపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో జతకట్టాలా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి గాలి జనార్దనరెడ్డి ఒక్కరిపైనే కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
అక్రమ గనులు తవ్వకాలు చేపట్టిన వారందరిపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. జనార్దనరెడ్డి ఎలాంటి తప్పుచేయకపోయినా రాజకీయ కక్షతోజైలుకు పంపారని గుర్తు చేశారు. గాలి జనార్దనరెడ్డి హయంలో బళ్లారి జిల్లాకు విడుదల చేసిన నిధులతోనే ప్రస్తుతం జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఇప్పటి వరకు ఎలాంటి కొత్త నిధులు విడుదల చేయలేదన్నారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వీసీ, రిజిస్ట్రార్‌ల మధ్య ఉన్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు.
కాంగ్రెస్‌వి కక్ష సాధింపు రాజకీయాలు
Published Fri, Aug 16 2013 4:28 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement