B. Sreeramulu
-
యడ్యూరప్ప మళ్లీ సీఎం కావడం ఖాయం
ఎంపీ శ్రీరాములు జోస్యం బళ్లారి : బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మళ్లీ కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన బళ్లారి జిల్లా హొసపేటె, హగరిబొమ్మనహళ్లి తాలూకాల పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టిన పంటలు ఎండిపోవడంతో ఆయా ప్రాంతాల్లో రైతులను పరామర్శించి వారికి స్వాంతన పలికారు. పంటలు ఎండిపోతున్నా సంబంధిత అధికారులు కనీసం పరిశీలన చేయడం లేదంటే ఈ కాంగ్రెస్ పాలన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అప్పుల పాలవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేపట్టిన అభివృద్ధి పనులను ఇప్పటికి జనం గుర్తు పెట్టుకుంటున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పురోగమనంలోకి నెట్టిందన్నారు. ఈనేపథ్యంలో మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందనే నమ్మకంతో జనం బీజేపీకి బ్రహ్మరథం పడుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ఇంటికి పోవడం ఖాయమని గుర్తు చేశారు. -
నా వంతు చేయూతనిస్తా
బళ్లారి అర్బన్ : విద్య, ఆర్థిక, సామాజిక పరంగా వెనుకబడిన హుగార సమాజ అభివృద్ధికి తన వంతు చేయూతనందిస్తానని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక శరణ సక్కరి కరిడప్ప వసతి నిలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అఖిల కర్ణాటక హుగార సమాజం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభావంత విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ధనవంతులైనా, పేదవారైనా విద్య లేకపోతే వారు ప్రగతికి దూరమవుతారన్నారు. హుగార సమాజం ప్రతిభా పురస్కార కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కంప్యూటర్ యుగంలో ప్రతిభ ఉంటేనే ప్రగతి సాధ్యమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల జనాభా ఉన్న హుగార సమాజస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు, రిజర్వేషన్లలో ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. ఈ సమాజాభివృద్ధికి ఎంపీ నిధుల కింద సహకారం అందిస్తానన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా తాను ఆశిస్తున్నది ఒకటే తమ సమాజం వారు రాజకీయ రంగంలో రాణిస్తే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. తమ పిల్లలను కుల వృత్తికే పరిమితం చేయకుండా వారికి ఉన్నత విద్యనందించి ఉన్నత పదవులు అలంకరించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు హుగార సమాజం లేని గ్రామాలు ఉండవన్నారు. భగవంతుని సాన్నిధ్యానికి సహకరించే పుష్పం, పత్రం ఎంత పవిత్రంగా ఉంటాయో అలాగే మీ హృదయాలు కూడా అలాగే ఉంటాయని భావిస్తున్నానన్నారు. అనంతరం 38 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి ప్రోత్సహించారు. కార్యక్రమంలో హుగార సమాజ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యకాంత పులారి, కార్యదర్శి లోచనేశ హూగార్, జిల్లాధ్యక్షుడు పంపాపతి, గౌరవాధ్యక్షుడు జే.గురుమూర్తి, కార్యదర్శి రుద్రప్ప, సభ్యులు జీవీ.ఈశ్వరప్ప పాల్గొన్నారు. -
నరేంద్రమోడీకి సంపూర్ణ మద్దతు
బీజేపీ మా మాతృ పార్టీ = పార్టీలోకి తిరిగి రావాలని శ్రీరాములును బీజీపీ నేతలు ఆహ్వానించారు = ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం = కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి సాక్షి, బళ్లారి : గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన ఇనుము సేకరణ కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ ఇండియా- రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశప్రజలందరూ నరేంద్ర మోడీవైపు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశానికి ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ తమ మాతృ పార్టీ అని, తాము ముందు నుంచి ఆ పార్టీలో పని చేశామని గుర్తు చేశారు. బీజేపీలోకి తిరిగి రావాలని బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములును ఆ పార్టీ నేతలు ఆహ్వానించారన్నారు. ఆయన తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో బసవరాజేశ్వరీ స్కూల్ అండ్ కాలేజీ చైర్మన్ డాక్టర్ మహిపాల్, మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌వి కక్ష సాధింపు రాజకీయాలు
సాక్షి, బళ్లారి : కక్షసాధింపు రాజకీయాలు చేస్తూ, ప్రతిపక్షాలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ఉప ఎన్నికల్లో ఒక్కటైన బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పార్టీలకు అంతర్గతంగా తాము మద్దతిస్తున్నట్లు బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములు తెలిపారు. ఆయన గురువారం నగరంలోని ఎస్పీ సర్కిల్‌వద్ద బీఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లోను ఆ పార్టీ వ్యతిరేకులపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఉప ఎన్నికల్లో జతకట్టిన జేడీఎస్, కేజేపీ, బీజేపీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒకటిగా ఉంటూ, ఆ పార్టీని అణగదొక్కాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారం లేక విలవిలలాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికార దాహం తీర్చుకునేందుకు ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చారని, అయితే ఆయ హామీలు తీర్చేందుకు నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయితే పలు అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు ఆశించారని, అయితే ఆ మేరకు పనులు జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం మవుతోందన్నారు. రాష్ట్రంలో ఉత్తమ వ్యక్తులపై లేనిపోని ఆరోపణలు చేయడంతోపాటు బీజేపీ నుంచి విడిపోయి కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు స్థాపించడం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కేజేపీ, జేడీఎస్ పొత్తుతో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటంలేదన్నారు. బీఎస్‌ఆర్‌సీపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో జతకట్టాలా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి గాలి జనార్దనరెడ్డి ఒక్కరిపైనే కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ గనులు తవ్వకాలు చేపట్టిన వారందరిపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. జనార్దనరెడ్డి ఎలాంటి తప్పుచేయకపోయినా రాజకీయ కక్షతోజైలుకు పంపారని గుర్తు చేశారు. గాలి జనార్దనరెడ్డి హయంలో బళ్లారి జిల్లాకు విడుదల చేసిన నిధులతోనే ప్రస్తుతం జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఇప్పటి వరకు ఎలాంటి కొత్త నిధులు విడుదల చేయలేదన్నారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వీసీ, రిజిస్ట్రార్ల మధ్య ఉన్న సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. -
బీజేపీ చీలిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారం
సాక్షి, బళ్లారి : అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బీఎస్ యడ్యూరప్ప, బీ. శ్రీరాములు వి డిపోయి కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున నాగప్ప, సగీర్ అహ్మద్‌లు పేర్కొన్నారు. బళ్లారి లోక్‌సభ అభ్యర్థి కోసం పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేం దుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గత అ సెంబ్లీ ఎన్నికల కంటే కేవలం 2 శాత ం మాత్రమే ఓట్ల శాతం పెరిగిందని గుర్తు చేశారు. తమకు అధికారం వచ్చింది కదా? అని కార్యకర్తలు, నేతలు విర్రవీగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నుంచి విడిపోయిన కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు స్వతంత్రంగా పోటీ చేస్తా యా? లేక బీజేపీలో తిరిగి కలుస్తాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియ లేదన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయికే కిలో బియ్యం, క్షీరభాగ్య వంటి సంక్షేమ పథకాలను జారీ చేసి జనరంజక పాలన అంది స్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బళ్లారి లోక్‌సభ నుంచి 1999లో సోనియాగాంధీ పోటీ చేసి గెలుపొందారని గుర్తు చేశారు. బళ్లారి జి ల్లాపై మేడం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. తాము ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రమే వచ్చామని, టికెట్ కేటాయింపు తమ చేతుల్లో లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్, కాంగ్రెస్ పరిశీలకులు గోపీనాథ్, చంద్రిక పరమేశ్వరీ, మాజీ ఎంపీ ఎన్వై హనుమంతప్ప, బళ్లారి నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ ఎంపీ కోళూరు బసవనగౌడ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పంపాపతి, డేగులపాడు నారాయణప్ప, వెంకటరావ్ ఘోర్పడే, అసుండి వన్నూరప్ప(వండ్రీ), గిరిమల్లప్ప, కమలా మరి స్వామి, కార్పొరేటర్లు వెంకటరమణ, అశోక్, బె ణకల్ బసవరాజగౌడ తదితరులు పాల్గొన్నారు.