యడ్యూరప్ప మళ్లీ సీఎం కావడం ఖాయం
ఎంపీ శ్రీరాములు జోస్యం
బళ్లారి : బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మళ్లీ కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన బళ్లారి జిల్లా హొసపేటె, హగరిబొమ్మనహళ్లి తాలూకాల పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టిన పంటలు ఎండిపోవడంతో ఆయా ప్రాంతాల్లో రైతులను పరామర్శించి వారికి స్వాంతన పలికారు. పంటలు ఎండిపోతున్నా సంబంధిత అధికారులు కనీసం పరిశీలన చేయడం లేదంటే ఈ కాంగ్రెస్ పాలన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
అప్పుల పాలవుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేపట్టిన అభివృద్ధి పనులను ఇప్పటికి జనం గుర్తు పెట్టుకుంటున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పురోగమనంలోకి నెట్టిందన్నారు. ఈనేపథ్యంలో మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందనే నమ్మకంతో జనం బీజేపీకి బ్రహ్మరథం పడుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ఇంటికి పోవడం ఖాయమని గుర్తు చేశారు.