కలవరంలో ‘కరుణ’!
కాంగ్రెస్‌లోని గ్రూప్ వార్ డీఎంకే అధినేత ఎం. కరుణానిధిని కలవరంలో పడేస్తోంది. హస్తం రూపంలో తమకు కొత్త చిక్కులు వస్తాయని భావిస్తున్న డీఎంకే ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధం అవుతోంది. ఈ పరిస్థితులకు కాంగ్రెస్ పెద్దలు చిదంబరం, తంగబాలు మద్దతుదారులు తాజాగా చేసిన ఎన్నికల బహిష్కరణ హెచ్చరికే కారణంగా కనిపిస్తోంది.
సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం. కరుణానిధి తీవ్ర వ్యూహాలతో ఉరకలు తీస్తున్నారు. తన నేతృత్వంలో మెగా కూట మికి ప్రయత్నాలు చేసి, చివరకు వెంట నడిచే వాళ్లను అక్కన చేర్చుకునే పనిలో పడ్డారు. ఆ దిశగా కాంగ్రెస్‌కు స్నేహహస్తం అందించారు. గతాన్ని మరిచి మళ్లీ పొత్తు బంధం తో డీఎంకేతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు సిద్ధమైనా, రాష్ట్రం లోని పరిస్థితులు కరుణ సేనను కలవరంలో పడేస్తున్నాయి. ఇందుకు కారణం కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలే. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదన్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు నాయకుల్ని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు అధిష్టానం తీవ్రంగానే కుస్తీలు పడుతున్నది.
అయితే, అధిష్టానం ఇటీవల తీసుకున్న నిర్ణయం గ్రూపు నాయకుల మద్దతుదారుల్లో ఆగ్రహాన్ని రేపి ఉన్నది. ఈ ఆగ్రహం ఎక్కడ తమకు చిక్కుల్ని , సమస్యల్ని సృష్టిస్తాయోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో బయలు దేరి ఉన్నది. హెచ్చరిక స్వరం : రాష్ట్రంలో కొత్త బాట అన్నట్టుగా అభ్యర్థుల ఎంపిక భారాన్ని జిల్లాల అధ్యక్షులకే అప్పగిస్తూ గత వారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించారు. దీంతో అశావహుల్ని ఇంటర్వ్యూ చేసే పనిలో ఆయా జిల్లాల నేతలు ఉన్నారు. అయితే, ఈ విధానాన్ని కాంగ్రెస్ సీనియర్లు చిదంబరం, తంగబాలు వంటి నాయకులు మద్దతుదారులు వ్యతిరేకించే పనిలో పడ్డారు. ఇందుకు కారణం రాష్ట్రంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మద్దతు జిల్లాల అధ్యక్షుడు ఎక్కువ కాబట్టి.
ఆయా జిల్లాల తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసుకునే పనిలో ఈవీకేఎస్ ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీలతో తమకు ప్రధాన శత్రువుగా ఉన్న ఈవీకేఎస్‌కు అనుకూలంగా రాహుల్ నిర్ణయం ఉండటంతో ఆ ఎంపికకు వ్యతిరేకంగా గళాన్ని విన్పించే పనిలో చిదంబరం, తంగబాలు తదితర నాయకుల మద్దతు దారులు నిమగ్నం అయ్యారు. వీళ్లంతా శనివారం రాత్రి నుంగంబాక్కంలోని చిదంబరం నివాసంలో భేటీ కావడం గమనార్హం. ఇందులో జిల్లాల అధ్యక్షుల పర్యవేక్షణలో సాగుతున్న అభ్యర్థుల ఎంపిక విధానాన్ని పక్కన పెట్టి, అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని అధిష్టానంపై ఒత్తిడికి గ్రూపు నేతల మద్దతుదారులు నిర్ణయించారు.
ఈ కమిటీని ఏర్పాటు చేయకుంటే, ఎన్నికల్ని బహిష్కరించేందుకు తాము సిద్ధం అన్నహెచ్చరికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. దీంతో ఈ గ్రూపుల వార్ తమకు ఎక్కడ గండి కొట్టి, చివరకు కష్టాల్లోకి నెడుతాయోనన్న బెంగ డీఎంకే శ్రేణుల్లో బయలు దేరి ఉన్నది. కాంగ్రెస్‌లో సాగుతున్న గ్రూపు వార్ కలవరాన్ని రేపుతుండటంతో, ముందస్తు చర్యలకు కరుణానిధి సిద్ధం అవుతున్నారు. గ్రూపుల మధ్య సఖ్యతకు కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచడమా..? లేదా, సీట్ల పందేరంలో మెళికల్ని పెట్టి చెక్ పెట్టడమా..? అన్న దిశగా ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.