బీజేపీ అంటే కాంగ్రెస్‌కు భయం
చెన్నై: భారతీయ జనతా పార్టీ అన్నా, ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులను కేవలం ఏడాదిన్నర కాలంలోనే బీజేపీ ప్రభుత్వం చేసి చూపిందనే భీతి కాంగ్రెస్ నేతల్లో నెలకొందని ఆమె ఎద్దేవా చేశారు.
చెన్నైలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ సాధించిన విజయాలను చూసి కాంగ్రెస్ నేతలు కంగారుపడుతున్నారని ఆమె అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల భారత దేశం ప్రగతి పథం వైపు పరుగులు పెడుతోందని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో సైతం భారతదేశ కీర్తి ఇనుమడించిందని, ఆర్థికంగా మరిన్ని ఫలితాలు సాధించేందుకు అనేక పథకాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఇంటి ఇంటికీ వెళ్లి ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించామని, అనేక పథకాల కింద సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లో చేరే ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. కేవలం నెలకు రూ.12 ప్రీమియంతో పేదలకు బీమా సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు అన్నివర్గాల వారికి పించన్ అందజేస్తున్నామని అన్నారు.
దేశాభివృద్ధిలో రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ఉన్నతమైన దేశంగా నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని ఆమె చెప్పారు. ఈ సత్యాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 60 ఏళ్లుగా తాము చేయలేక పోయామని కాంగ్రెస్ నేతలు కలత చెందుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.