కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన ఉద్యోగ నియామకాల విషయంలో టీజేఏసీ చేయతలపెట్టిన నిరుద్యోగ ప్రదర్శనను భగ్నం చేయడానికి చైర్మన్ ప్రో.కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం హేయమైన చర్య.. అప్రజాస్వామికం.. అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉన్న అయన ఈ విషయమై బుధవారం ఒక ప్రకటన చేస్తూ కోదండరాం అరెస్టును తీవ్రంగా ఖండించారు. నీళ్లు..నిధులు..నియామకాలు అనే అంశాలపైనే తెలంగాణ ఉద్యమం సాగింది.. కాంగ్రెస్ పార్టీ కృషి.. సోనియా గాంధీ పట్టుదలతో తెలంగాణ సాదించుకున్నాం. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు 33 నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా సాగుతుందని ఆయన అన్నారు.
నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేసారని.. నిరుద్యోగులు అంటే కేసీఆర్ భయపడుతున్నారని అయన అన్నారు. అనేక సందర్భాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. తరువాత కొత్త జిల్లాలు వస్తే మరో 30 వేల ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పి ఇపుడు కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. స్వేచ్ఛ లేకుండా.. రాజ్యాంగ రహితంగా అణచివేసే ధోరణిలో పాలిస్తున్న ఈ పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన అన్నారు.