టీఆర్‌ఎస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది: మల్లు
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరాంను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని.. అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్‌లకు పాల్పడటం అప్రజాస్వామికమని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రంలో కూడా ఏరోజు కోదండరాం పై ఇలాంటి అరెస్ట్ లు జరగలేదని.. కేసీఆర్ సర్కార్ పోకడ నిజాం రజాకార్లను తలపిస్తుస్తోందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు కోదండరామ్ అని అయనను అవమానకరంగా అరెస్ట్ చేయడం బాధకరమన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు, ఉద్యోగ నియామకాలపై ప్రశ్నించడమే నేరమా.. నక్సలైట్ ఎజెండా అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఉద్యమంలో పోరాడిన యువతను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని.. నిర్బంధంతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కోదండరాంను అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ సర్కార్ సెల్ఫ్ గోల్ కొట్టకుందని ఎద్దేవ చేశారు.