unemployed rally
-
టీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది: మల్లు
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరాంను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని.. అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్లకు పాల్పడటం అప్రజాస్వామికమని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రంలో కూడా ఏరోజు కోదండరాం పై ఇలాంటి అరెస్ట్ లు జరగలేదని.. కేసీఆర్ సర్కార్ పోకడ నిజాం రజాకార్లను తలపిస్తుస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు కోదండరామ్ అని అయనను అవమానకరంగా అరెస్ట్ చేయడం బాధకరమన్నారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు, ఉద్యోగ నియామకాలపై ప్రశ్నించడమే నేరమా.. నక్సలైట్ ఎజెండా అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఉద్యమంలో పోరాడిన యువతను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని.. నిర్బంధంతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కోదండరాంను అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ సర్కార్ సెల్ఫ్ గోల్ కొట్టకుందని ఎద్దేవ చేశారు. -
కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన ఉద్యోగ నియామకాల విషయంలో టీజేఏసీ చేయతలపెట్టిన నిరుద్యోగ ప్రదర్శనను భగ్నం చేయడానికి చైర్మన్ ప్రో.కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం హేయమైన చర్య.. అప్రజాస్వామికం.. అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉన్న అయన ఈ విషయమై బుధవారం ఒక ప్రకటన చేస్తూ కోదండరాం అరెస్టును తీవ్రంగా ఖండించారు. నీళ్లు..నిధులు..నియామకాలు అనే అంశాలపైనే తెలంగాణ ఉద్యమం సాగింది.. కాంగ్రెస్ పార్టీ కృషి.. సోనియా గాంధీ పట్టుదలతో తెలంగాణ సాదించుకున్నాం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు 33 నెలలు అవుతున్నా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యంగా సాగుతుందని ఆయన అన్నారు. నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేసారని.. నిరుద్యోగులు అంటే కేసీఆర్ భయపడుతున్నారని అయన అన్నారు. అనేక సందర్భాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. తరువాత కొత్త జిల్లాలు వస్తే మరో 30 వేల ఉద్యోగాలు ఇవ్వొచ్చని చెప్పి ఇపుడు కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. స్వేచ్ఛ లేకుండా.. రాజ్యాంగ రహితంగా అణచివేసే ధోరణిలో పాలిస్తున్న ఈ పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెపుతారని ఆయన అన్నారు. -
‘ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్’
హైదరాబాద్: కోదండరాం మొదటి నుంచి రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు తేట తెల్లమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. పార్టీ పెట్టడంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలు నిజమని నిరూపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఆనాడు కేసీఆర్ టీజేఏసీ ని ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. కోదండరాం ను చైర్మన్ గా చేసింది కేసీఆర్ యే అన్నారు. తెలంగాణ ఏర్పాటుకాగానే జేఏసీ అవసరం తీరిపోయిందని.. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైదొలిగినా ప్రజా సంఘాలతో కొనసాగుతున్న జేఏసీ రాజకీయాలే లక్ష్యంగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రొఫెసర్ గా నిజాలు చెప్పాల్సిన కోదండరామ్ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని.. ఉద్యోగ నియామకాల పై ఆయన చేస్తున్న ప్రకటనలు తప్పని నిరూపించేందుకు వాస్తవాలతో కూడిన పత్రం పంపిస్తామన్నారు. దాదాపు 32 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, కోదండరాం కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ గా మారారని విమర్శించారు. ' నాలుగు రోజుల కింద ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన మాటలే ఇపుడు కోదండరాం మాట్లాడుతున్నారు.. కోదండరాం ముసుగు తొలిగింది.. ఆయన పట్ల ప్రజల్లో భ్రమలు కూడా తొలిగి పోయాయి. కోదండ రామ్ కు పార్టీ పెట్టె హక్కు ఉంది. పార్టీ పెట్టి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు తనవారికి ఇప్పించుకోవాలన్నదే కోదండరాం తపన. రాజకీయేతర సంఘాల ముసుగులో కోదండరాం రాజకీయాలు చేయడంమీదే మా అభ్యంతరం.. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కోదండరాం ర్యాలీ కి పిలుపు నిచ్చారు. హింసను ప్రేరేపించేందుకు యత్నిస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరాం ర్యాలీ కి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనేది పరిస్ధితులను బట్టి డీజీపీ నిర్ణయం తీసుకుంటారు. అబద్దాలతో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అశాంతి నెలకొంటున్నదంటూ కోదండ రామ్ మాట్లాడుతుండడం విడ్డూరం. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. అంతవరకు కోదండరాం కు తొందరపాటు తగదు' అని కర్నె ప్రభాకర్ ఆరోపించారు.