‘ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్’
‘ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్’
Published Sat, Feb 18 2017 4:23 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
హైదరాబాద్: కోదండరాం మొదటి నుంచి రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు తేట తెల్లమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. పార్టీ పెట్టడంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలు నిజమని నిరూపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఆనాడు కేసీఆర్ టీజేఏసీ ని ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. కోదండరాం ను చైర్మన్ గా చేసింది కేసీఆర్ యే అన్నారు. తెలంగాణ ఏర్పాటుకాగానే జేఏసీ అవసరం తీరిపోయిందని.. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైదొలిగినా ప్రజా సంఘాలతో కొనసాగుతున్న జేఏసీ రాజకీయాలే లక్ష్యంగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రొఫెసర్ గా నిజాలు చెప్పాల్సిన కోదండరామ్ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని.. ఉద్యోగ నియామకాల పై ఆయన చేస్తున్న ప్రకటనలు తప్పని నిరూపించేందుకు వాస్తవాలతో కూడిన పత్రం పంపిస్తామన్నారు. దాదాపు 32 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, కోదండరాం కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ గా మారారని విమర్శించారు.
' నాలుగు రోజుల కింద ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన మాటలే ఇపుడు కోదండరాం మాట్లాడుతున్నారు.. కోదండరాం ముసుగు తొలిగింది.. ఆయన పట్ల ప్రజల్లో భ్రమలు కూడా తొలిగి పోయాయి. కోదండ రామ్ కు పార్టీ పెట్టె హక్కు ఉంది. పార్టీ పెట్టి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు తనవారికి ఇప్పించుకోవాలన్నదే కోదండరాం తపన. రాజకీయేతర సంఘాల ముసుగులో కోదండరాం రాజకీయాలు చేయడంమీదే మా అభ్యంతరం.. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కోదండరాం ర్యాలీ కి పిలుపు నిచ్చారు. హింసను ప్రేరేపించేందుకు యత్నిస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరాం ర్యాలీ కి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనేది పరిస్ధితులను బట్టి డీజీపీ నిర్ణయం తీసుకుంటారు. అబద్దాలతో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అశాంతి నెలకొంటున్నదంటూ కోదండ రామ్ మాట్లాడుతుండడం విడ్డూరం. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. అంతవరకు కోదండరాం కు తొందరపాటు తగదు' అని కర్నె ప్రభాకర్ ఆరోపించారు.
Advertisement
Advertisement