చట్టప్రకారం చర్యలకు కాంగ్రెస్ డిమాండ్
Published Thu, Jan 23 2014 11:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను కలిశారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని బృందం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి..సోమ్‌నాథ్ భారతి వ్యవహారంలో జోక్యం కలిగించుకొని చట్టప్రకారం చర్యలు చేపట్టవలసిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని, ఈ కేసులో చట్టప్రకారం దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని తాము లెప్టినెంట్ గవర్నర్‌ను కోరామని లవ్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రి చట్టానికి అతీతుడు కాడని, ఆయనపై తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తాము కోరామన్నారు.
నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తానని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తమకు హామీ ఇచ్చారని సమావేశం తరువాత విలేఖరులతో మాట్లాడిన లవ్లీ చెప్పారు. తాము ఆప్ ప్రభుత్వానికి 18 అంశాలపై మద్దతు ఇస్తున్నామని, వారు ఈ అంశాలలో దేని నుంచైనా పక్కకు తప్పుకున్నట్లయితే తమ మద్దతును ఉపసంహరించడం గురించి ఆలోచిస్తామని లవ్లీ హెచ్చరించారు. సోమ్‌నాథ్ భారతీని మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఈ కేసులో చట్టప్రకారం వ్యవహరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని మాత్రమే తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరామ’ని చెప్పారు.
Advertisement