Lt. Governor Najeeb Jung
-
ప్రజాప్రభుత్వమే సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెం ట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలకు కత్తెర వేసిన న్యాయ స్థానం.. ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగానే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటిం చింది. ఢిల్లీ రాష్ట్రం కాదని, ప్రస్తుతమున్న రాజ్యాంగ పరిమితుల్లో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కీలక తీర్పును ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిని స్పష్టంగా వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ సర్కారు పై చేయి సాధించినట్లయ్యింది. నేపథ్యం ఇదీ..: 2014లో ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కినప్పటి నుంచి కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌జంగ్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభేదిస్తూ వచ్చారు. వారు కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఎల్జీ కేంద్రం అండ చూసుకుని తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అనేక అప్పీళ్లు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239ఏఏతో ముడిపడి ఉన్న అనేక విషయాలకు తాజా తీర్పుతో జవాబిచ్చింది. ఎల్జీ పాలనాధికారి మాత్రమే.. సీజేఐ జస్టిస్ మిశ్రా తన తరఫున, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ తరఫున 237 పేజీల తీర్పును వెలువరించింది. ‘ప్రస్తుత రాజ్యాంగ పరిమితుల మేరకు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదు. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రత్యేకమైనది. భిన్నమైనది. లెఫ్టినెంట్ గవర్నర్ హోదా.. రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదు. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే. పరిమితార్థంలో ఎల్జీ హోదాలో ఆయన పని చేస్తారంతే’ అని సీజేఐ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. మంత్రిమండలితో ఘర్షణ పూరిత వైఖరితో కాకుండా ఎల్జీ సంధానకర్త లాగా వ్యవహరించాలని, ఎల్జీకి, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు పరిధి దాటకూడదని, వాటిని చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకో వాలంది. ‘ఎల్జీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఎటువంటి అధికారం లేదు. ఆయన మంత్రిమండలి సలహాలు, సూచనల ఆధారంగా పనిచేయాలి. లేదా ఆయన సూచనల మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి’అని పేర్కొన్నారు. మంత్రిమండలి తీసుకునే ప్రతి నిర్ణయం ఎల్జీకి తెలియజేయాలని, అయితే ప్రతి అంశంలోనూ ఎల్జీ ఆమోదం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూములు ఈ మూడు అంశాలు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునేది కేబినెట్.. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెలువరించిన 175 పేజీల అనుబంధ తీర్పులో నిర్ణయాలు తీసుకునేది ఎల్జీ కాదని, మంత్రిమండలి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎల్జీ గుర్తుపెట్టుకోవా లన్నారు. రాష్ట్రపతి నిర్ణయానికి కూడా ఎల్జీ బద్ధుడై ఉండాలని తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన 123 పేజీల అనుంబంధ తీర్పులో ఎన్నికైన∙ప్రజాప్రతిని ధులకు ఢిల్లీ శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి అభిప్రాయాలు, నిర్ణయాలను అన్ని సమయా ల్లోనూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ప్రజల విజయం: కేజ్రీవాల్ అధికారం కోసం కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన ‘ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా: చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఘన విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన చిదంబరం అన్నారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందన్నారు. ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి దక్కిన ఘన విజయం. క్లీన్ చిట్ ఉన్న లెఫ్టినెంట్ అనిల్ బైజాల్.. రాజకీయ గురువుల మాట విని తప్పుడు మార్గంలో ఎందుకు నడిచారు?’ అని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చిదంబరం ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. నష్టం జరిగినా కేజ్రీవాల్‌కు పండుగే: బీజేపీ తన ప్రభుత్వానికి పూర్తి అధికారాలివ్వాలన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆయన పండుగ చేసుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం, ఎల్జీ మధ్య జరుగుతున్న అధికార పోరాటంలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ గౌరవాన్ని నిలబెట్టింది. కేబినెట్ నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగానికి తన కిష్టమైన అర్థాన్ని చెప్పడం కేజ్రీవాల్ నైజం. నష్టపోయినా ఉత్సవాలు జరుపుకునేదెవరంటే కేజ్రీవాల్ అనే సమాధానం వస్తుంది’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదీ ‘ఢిల్లీ’ చరిత్ర... న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాం నుంచి నేటి వరకు ఢిల్లీ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలివీ.. బ్రిటిష్ పాలకులు 1911లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ సమయంలో ఢిల్లీకి అధినేతగా ఓ కమిషనర్‌ను నియమించి, దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ అని పిలిచేవారు. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఢిల్లీని పార్ట్–సీ రాష్ట్రంగా మార్చారు. అక్కడ అసెంబ్లీ ఏర్పాటుచేయడానికి ప్రత్యేక చట్టం చేశారు. పార్ట్– ఏ,బీ,సీ,డీ రాష్ట్రాలను రద్దుచేస్తూ 1956, అక్టోబర్ 19న రాష్ట్రాల పునర్విభజన చట్టానికి ఆమోదం లభించింది. ఫలితంగా దేశంలోని ప్రాంతాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. దీనిలో భాగంగా, రాష్ట్రపతి నియమించే వ్యక్తి పాలించేలా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైంది. ఢిల్లీ శాసనసభ, శాసనమండలి రద్దయ్యాయి. ఆ తరువాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు, మంత్రి మండళ్లను ఏర్పాటుచేసేందుకు 1963లో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ చేశారు. అయితే ఈ చట్టాన్ని ఢిల్లీకి వర్తింపచేయలేదు. కానీ, 1966 నాటి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చట్టం ప్రకారం..56 మంది ఎన్నికైన సభ్యులతో కూడిన మెట్రోపాలిటన్ కౌన్సిల్, ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో పరిమిత ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. గవర్నర్/అడ్మినిస్ట్రేటర్/చీఫ్ కమిషనర్ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటూ రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని 1966, ఆగస్టు 20న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీకి ఏ హోదా ఇవ్వాలన్న విషయమై 1987లో బాలక్రిష్ణన్ కమిటీని నియమించారు. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగానే సాగిస్తూ, శాసనసభ, మంత్రిమండలిని ఏర్పాటుచేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, స్థిరత్వం కోసం ప్రత్యేక హోదా ఇచ్చేలా రాజ్యాంగపర చర్యలు తీసుకోవాలంది. ఫలితంగా 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేపట్టి, నిబంధన 239ఏఏ (ఢిల్లీకి ప్రత్యేక నిబంధనలు), 239ఏబీ(రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైన సందర్భాలు)లను చేర్చారు. నాలుగేళ్ల క్రితమే వివాదానికి బీజాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)తో రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదానికి బీజాలు నాలుగేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో గ్యాస్ ధరలను ఏకపక్షంగా నిర్ణయించారంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మురళీ దేవ్రా తదితరులపై కేజ్రీవాల్ కేసు పెట్టారు. ► 2014, మే 2: ఈ కేసును కొట్టేయాలంటూ రిలయన్స్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం ఢిల్లీ ఏసీబీకి ఇస్తూ 1993లో కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేసింది. ► 2014 మే 8: కేంద్ర మంత్రుల కేసులపై విచారణ అధికారం ఏసీబీకి ఇవ్వడాన్ని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ► 2014 ఆగస్టు 19: గ్యాస్ ధరల నిర్ణయంపై కేంద్ర మంత్రులతోపాటు రిలయన్స్‌పై పెట్టిన కేసుల దర్యాప్తు పరిధి నుంచి కేంద్రం తమను తప్పించిందని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. ► 2015 జూన్ 27: ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనాను ఏసీబీ ఆఫీసులోకి ప్రవేశించనీయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసింది. ► 2016 ఆగస్ట్ 4: ఎల్జీ కేబినెట్ సలహా మేరకు పనిచేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 9: ఈ తీర్పుపై ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించింది. ► 2017 డిసెంబర్ 6: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదావేసింది. ఓటుహక్కుది చిరస్థాయి: సుప్రీం న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు చిరస్థాయిగా నిలిచిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దేశం తమదేననే భావనను అది ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు కోత పెడుతూ వెలువరించిన చారిత్రక తీర్పులో ఈ విధంగా స్పందించింది. ప్రజ ల ఆకాంక్షలు అమలయ్యేలా చూడటం అవసరమంది. ‘ఓటుహక్కు ప్రాథమిక హక్కు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అది గుండెకాయ స్థానంలో ఉంటుంది’ అని పేర్కొంది. -
అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్ బిల్లు
విధానసభ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో అవినీతిని అంతమొందించడానికి తమ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు తెస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. రెండోరోజు విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా అవసరమన్నారు. శాంతి భద్రతల సంరక్షణ కోసం స్థానిక పోలీసులు ఢిల్లీ సర్కారు కిందే పనిచేయాలన్నారు. పారదర్శకత అనే పునాదులపై పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ పూర్తి నిజాయితీతో సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అందువల్ల అభివృద్ధికి మార్గం సుగమమైందని చెప్పారు. ఢిల్లీని మహిళలకు సురక్షితమైన నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లతో కలసి పనిచేస్తాం తమ ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఎమ్సీడీలతో కలసి పనిచేస్తుందని చెప్పారు. అయితే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కావాలని స్థానికులు చాలాకాలంగా కోరుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర కావాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రజలకు చౌకగా ఇళ్లు అందించాలంటే ఢిల్లీ అభివృద్ధి స్థానిక సర్కారు కిందే ఉండాలని ఆయన చెప్పారు. మహిళలకు భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం అందేలాచేయడం కోసం తమ ప్రభుత్వం మరిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తుందని చెప్పారు. ఢిల్లీని వైఫై ఆధారిత డిజిటల్ రాజధానిగా మారుస్తామని చెప్పారు. నగరాన్ని పెట్టుబడిదారులకు సన్నిహితంగా మార్చడంద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని నజీబ్ జంగ్ చెప్పారు. తమ సర్కారు కొత్త ఆరోగ్య కేంద్రాలను తెరుస్తుందని తెలిపారు. కొత్త కళాశాలలను నెలకొల్పుతామన్నారు. దాడులను తగ్గించి వ్యాపారులకు వేధింపుల నుంచి ఉపశమనం కలిగిస్తామని చెప్పారు. గ్రామాల అభివ ద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిపెడుతుందని పేర్కొన్నారు. -
ఫ్లైఓవర్ల కింద టెంట్లు వేయండి: ఎల్జీ
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో రక్తం గడ్డకట్టేలా చలిపులి పంజా విసురుతుండడంతో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అధికారులను ఆదేశించారు. నిరాశ్రయుల కోసం ఫ్లైఓవర్ల కింద టెంట్లు వేయాలని ఆదేశించిన ఎల్జీ, నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని ఢిల్లీ మెట్రోను కోరారు. గత రెండు రోజుల్లో ఎల్జీ నగరంలోని అనేక నైట్ షెల్టర్లను సందర్శించారు. నగరంలోని నిరాశ్రయులందరికీ నీడ, పడక సదుపాయం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఢల్లీ పట్టణ ఆశ్రయ అభివృద్ధి బోర్డు (డీయూఎస్ఐబీ)కి టెంట్లు సమకూర్చుకునేందుకు అదనంగా మరో రూ.7 కోట్లను జంగ్ కేటాయించారని ఎల్జీ అధికార నివాసమైన రాజ్‌నివాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు డీయూఎస్ఐబీకి రూ.5 కోట్లు కేటాయించారు. ప్రజలను సురక్షితంగా, వెచ్చగా ఉండే నైట్ షెల్టర్లకు తరలించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలామంది నిరాశ్రయులు రోడ్లను, ఫ్లైఓవర్లను విడిచిపెట్టడం లేదని అధికారులు చెప్పారు. ఇలా మొండిగా వ్యవహరిస్తున్న వారి కోసం ఎల్జీ ఫ్లైఓవర్ల కిందనే టెంట్లు వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ ఏర్పాట్లు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉంటాయని అన్నారు. -
సకాలంలో ప్రాజెక్టుల పూర్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయాలని ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలతో జంగ్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాలకు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను రోహిణి మెడికల్ కళాశాలకు సంబంధించి చేపట్టిన పనులపై ఆరోగ్య కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు కావాల్సిన మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాలపై ఆరా తీశారు. అలాగే కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు తగిన కనీస సదుపాయాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని విద్యా శాఖ అధికారులను హెచ్చరించారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల ఏర్పాటుపై ఆరా తీశారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోని ఉర్దూ, పంజాబీ, సంస్కృతం బోధిస్తున్న పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా సీనియర్ సెకండరీ పాఠశాలలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అంతేకాక అయా విభాగాలు చేపట్టిన పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆయన సూచించారు. చిట్ చలాన్ కేసులు మూడు జోన్లకు బదిలీ చిట్ చలాన్ కేసులను తన పరిధిలోని మూడు జోన్లకు బదిలీ చేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. పశ్చిమ మున్సిపల్ జోన్ కిందకు వచ్చే చిట్ చలాన్ కేసులను రోహిణీ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, వెస్ట్ తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ఎస్డీఎంసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విధంగా దక్షిణ, మధ్య ఢిల్లీ మున్సిపల్ జోన్లకు సంబంధించిన చలాన్ కేసులు ద్వారకా మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పరిధిలోకి వచ్చేవని, ఇప్పుడు సదరు కేసులను వరుసగా దక్షిణ, ఆగ్నేయ సాకేత్ ప్రాంతాల్లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(ట్రాఫిక్) కోర్టులకు బదిలీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఎస్‌డీఎంసీకి చెందిన చిట్ చలాన్ కేసుల బదిలీ ప్రతిపాదనకు ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులందరూ ఆమోదించారని ఆయన వివరించారు. ఈ కేసుల బదిలీ వల్ల పౌరులకు గొప్ప ఊరట కలుగుతుందని తాము భావిస్తున్నామని ఎస్డీఎంసీ కమిషనర్ మనీష్ గుప్తా తెలిపారు. ఈ చర్య వల్ల తమ చలానాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడివారు అక్కడ చెల్లించుకునేందుకు వీలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అసెంబ్లీని రద్దు చేయండి
అసెంబ్లీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు జరిపించవలసిందిగా ఆప్ శాససభ్యులు ఎల్జీ నజీబ్ జంగ్‌ను కోరారు. కేజ్రీవాల్ నేతృత్వంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలు నజీబ్‌జంగ్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే అవకాశం ఉందని జంగ్‌ను హెచ్చరించారు.ఎల్జీతో సమావేశం వివరాలను కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ..ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని తరచుగా బీజేపీ చెప్పుకుంటున్న మాటలను సవాలు చేశారు. ‘ఏ ఫార్ములాతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నకు ఎల్జీ వద్ద కూడా సమాధానం లేదు’ అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖమేన ని, ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడాని బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తే సంఖ్యాబలం చూపాల్సిందిగా జంగ్బీజేపీని కోరవచ్చన్నారు. తమ ఎమ్మెల్యేలను అందరినీనీ ఎల్జీ ముందు ఉంచి, వారెక్కడికీ పోవడం లేదని చెప్పినట్టు కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరూ తన వెంట ఉన్నట్లు స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో బీజేపీ ఏ ఫార్ములాతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఎన్నికలు జరిపించడానికి బీజేపీ ఆసక్తితో ఎందుకు లేదో తెలుసుకోవడానికి కూడా ఎల్జీ ఉత్సాహం చూపించారని వెల్లడించారు. కేజ్రీవాల్ తమ 24 మంది ఎమ్మెల్యేలతో తమతో భేటీ అయ్యారని, మొత్తం పరిస్థితిని పరిశీలించి, తగిన సంప్రదింపులు జరిపిన తరువాత జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తారని ఎల్జీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలూ తమ ఎమ్మెల్యేలంతా తమ వెంటనే ఉన్నారని ప్రకటించాయన్నారు. అటువంటుప్పుడు బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని ప్రశ్నించారు. అందువల్ల అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరామని చెప్పారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనడం లేదా బెదిరిస్తున్న విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు సిసోడియా వివరించారు. -
రాఠీ ఫిర్యాదుపై ఎల్జీ వివరణ కోరిన హైకోర్టు
న్యూఢిల్లీ: భత్యాలు నిలిపివేశారని, తన ప్రాథమిక హక్కులను ఢిల్లీ పోలీసులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఏసీపీ ఎస్ఎస్ రాఠీ దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, నగర పోలీస్ కమిషనర్ బస్సీ దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 1997లో కన్నాట్‌ప్లేస్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి రాఠీకి కోర్టు జీవితఖైదు శిక్షను విధించింది. దీంతో అతణ్ని విధుల నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిననాటి నుంచి అతనికి రావాల్సిన భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనిని సవాలు చేస్తూ రాఠీ కోర్టును ఆశ్రయించారు. భార్యను, పెళ్లి కాని కూతురును పోషించాల్సిన బాధ్యత ఇంకా తనపైనే ఉందని, న్యాయవాదిగా తన కొడుకు ఇంకా సంపాధించే స్థితికి చేరుకోలేదని, వెంటనే రావాల్సిన భత్యాలను ఇప్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎల్జీ, సీపీలకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. -
సత్వర చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: ఎండతీవ్రత పెరగడంతో నెలకొం టున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. రాజ్‌నివాస్‌లో నిర్వహించిన సమావేశంలో డివిజినల్ కమిషనర్, 11 జిల్లాలతో డిప్యూటీ కమిషనర్లకు ఈమేరకు సూచించారు. అన్ని పథకాలకు సంబంధించి ప్రజలకు నిర్థిష్ట కాల పరిమితితో సేవలందించాలని పేర్కొన్నారు. స్థానికంగా పర్యటనలు చేపట్టేలా ఆయా జిల్లాల అధికారులను పంపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలన్నారు. స్థానిక సమస్యల ప్రాతిపదిక నివేదికలు అందజేయాలని కోరారు. ప్రతి పదిహేను రోజులకు ఓసారి రాజ్‌నివాస్‌లో సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. జుగ్గీజోపిడీలు, అనధికారిక కాలనీల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఆదర్శవంతంగా ప్రజాసేవలో ముందుండాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలకూ సన్నద్ధమవుతున్న కార్పొరేషన్ మరోవైపు వర్షాకాలం రాగానే ఢిల్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం... నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అతి పురాతనమైనది కావడం, అంతసమర్ధవంతమైనది కాకపోవడం. దీంతో వర్షపు నీరు బయటకు పోలేక కాలనీల్లోనే నిలిచిపోతుంది. వర్షాకాలంలో నగరం నీటి ప్రపంచాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నీటిపారుదల, వరద నివారణ శాఖ, ఢిల్లీ మున్సిపల్ కర్పారేషన్ సంయుక్తంగా నీరు నిలవకుండా ఉండేందుకు, రవద నీటిని అదుపు చేసేందుకు ప్రతి ఏటా ముందస్తు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా వర్షపు నీటి కాలువల శుద్ధి, మరమ్మతులు, నీటి పైపులను శుద్ధి, మరమ్మతులు, నగరంలోని 12 మున్సిపల్ జోన్లలో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఈశాన్య మున్సిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి యోగేంద్ర మన్ తెలిపారు. ‘ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రారంభించాం. నిలిచిపోయిన నీటిని తోడి పారబోయడానికి కొత్త పంపులను కూడా ఏర్పాటు చేశాం. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని యోగేంద్ర చెప్పారు. అన్ని విభాగాలు కలిసి ఈ ఏడాది వానాకాలంలో వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, జూన్ 15కల్లా పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అయితే డ్రైనేజ్ కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు పడేయకుండా ఉండాలని యోగేంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ఏరియా, బరఫ్ ఖానా చౌక్, ఐఎస్బీటీ కష్మీరీ గేట్, రైల్వేబ్రిడ్జ్, సబ్జీమండీ, షాద్రా, జేజే బులంద్ మసీదు, మానస సరోవర్ పార్క్, బాదర్పూర్ రోడ్, ఖిచ్రిపూర్, మండవలిలను అత్యంత దుర్భలమైన ప్రాంతాలుగా గుర్తించింది కార్పొరేషన్. చిన్నవర్షం పడినా చిత్తడిగా మారే ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. -
చట్టప్రకారం చర్యలకు కాంగ్రెస్ డిమాండ్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను కలిశారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని బృందం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి..సోమ్‌నాథ్ భారతి వ్యవహారంలో జోక్యం కలిగించుకొని చట్టప్రకారం చర్యలు చేపట్టవలసిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని, ఈ కేసులో చట్టప్రకారం దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని తాము లెప్టినెంట్ గవర్నర్‌ను కోరామని లవ్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రి చట్టానికి అతీతుడు కాడని, ఆయనపై తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తాము కోరామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తానని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తమకు హామీ ఇచ్చారని సమావేశం తరువాత విలేఖరులతో మాట్లాడిన లవ్లీ చెప్పారు. తాము ఆప్ ప్రభుత్వానికి 18 అంశాలపై మద్దతు ఇస్తున్నామని, వారు ఈ అంశాలలో దేని నుంచైనా పక్కకు తప్పుకున్నట్లయితే తమ మద్దతును ఉపసంహరించడం గురించి ఆలోచిస్తామని లవ్లీ హెచ్చరించారు. సోమ్‌నాథ్ భారతీని మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఈ కేసులో చట్టప్రకారం వ్యవహరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని మాత్రమే తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరామ’ని చెప్పారు.