అసెంబ్లీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు జరిపించవలసిందిగా ఆప్ శాససభ్యులు ఎల్జీ నజీబ్ జంగ్‌ను కోరారు. కేజ్రీవాల్ నేతృత్వంలో 24 మంది ఆప్ ఎమ్మెల్యేలు నజీబ్‌జంగ్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే అవకాశం ఉందని జంగ్‌ను హెచ్చరించారు.ఎల్జీతో సమావేశం వివరాలను కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ..ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నామని తరచుగా బీజేపీ చెప్పుకుంటున్న మాటలను సవాలు చేశారు. ‘ఏ ఫార్ములాతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
ఈ ప్రశ్నకు ఎల్జీ వద్ద కూడా సమాధానం లేదు’ అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖమేన ని, ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మాటలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడాని బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తే సంఖ్యాబలం చూపాల్సిందిగా జంగ్‌బీజేపీని కోరవచ్చన్నారు. తమ ఎమ్మెల్యేలను అందరినీనీ ఎల్జీ ముందు ఉంచి, వారెక్కడికీ పోవడం లేదని చెప్పినట్టు కేజ్రీవాల్ తెలిపారు. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరూ తన వెంట ఉన్నట్లు స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో బీజేపీ ఏ ఫార్ములాతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఎన్నికలు జరిపించడానికి బీజేపీ ఆసక్తితో ఎందుకు లేదో తెలుసుకోవడానికి కూడా ఎల్జీ ఉత్సాహం చూపించారని వెల్లడించారు.
కేజ్రీవాల్ తమ 24 మంది ఎమ్మెల్యేలతో తమతో భేటీ అయ్యారని, మొత్తం పరిస్థితిని పరిశీలించి, తగిన సంప్రదింపులు జరిపిన తరువాత జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తారని ఎల్జీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే మనీశ్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలూ తమ ఎమ్మెల్యేలంతా తమ వెంటనే ఉన్నారని ప్రకటించాయన్నారు. అటువంటుప్పుడు బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని ప్రశ్నించారు. అందువల్ల అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరామని చెప్పారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనడం లేదా బెదిరిస్తున్న విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు సిసోడియా వివరించారు.
అసెంబ్లీని రద్దు చేయండి
Published Mon, Jul 21 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement