విధానసభ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో అవినీతిని అంతమొందించడానికి తమ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు తెస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. రెండోరోజు విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా అవసరమన్నారు. శాంతి భద్రతల సంరక్షణ కోసం స్థానిక పోలీసులు ఢిల్లీ సర్కారు కిందే పనిచేయాలన్నారు. పారదర్శకత అనే పునాదులపై పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ పూర్తి నిజాయితీతో సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అందువల్ల అభివృద్ధికి మార్గం సుగమమైందని చెప్పారు. ఢిల్లీని మహిళలకు సురక్షితమైన నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కార్పొరేషన్లతో కలసి పనిచేస్తాం
తమ ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఎమ్సీడీలతో కలసి పనిచేస్తుందని చెప్పారు. అయితే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కావాలని స్థానికులు చాలాకాలంగా కోరుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర కావాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రజలకు చౌకగా ఇళ్లు అందించాలంటే ఢిల్లీ అభివృద్ధి స్థానిక సర్కారు కిందే ఉండాలని ఆయన చెప్పారు. మహిళలకు భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం అందేలాచేయడం కోసం తమ ప్రభుత్వం మరిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తుందని చెప్పారు.
ఢిల్లీని వైఫై ఆధారిత డిజిటల్ రాజధానిగా మారుస్తామని చెప్పారు. నగరాన్ని పెట్టుబడిదారులకు సన్నిహితంగా మార్చడంద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని నజీబ్ జంగ్ చెప్పారు. తమ సర్కారు కొత్త ఆరోగ్య కేంద్రాలను తెరుస్తుందని తెలిపారు. కొత్త కళాశాలలను నెలకొల్పుతామన్నారు. దాడులను తగ్గించి వ్యాపారులకు వేధింపుల నుంచి ఉపశమనం కలిగిస్తామని చెప్పారు. గ్రామాల అభివ ద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిపెడుతుందని పేర్కొన్నారు.
అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్ బిల్లు
Published Tue, Feb 24 2015 11:23 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement