Janlokpal Bill
-
అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్ బిల్లు
విధానసభ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో అవినీతిని అంతమొందించడానికి తమ ప్రభుత్వం జన్‌లోక్‌పాల్ బిల్లు తెస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. రెండోరోజు విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా అవసరమన్నారు. శాంతి భద్రతల సంరక్షణ కోసం స్థానిక పోలీసులు ఢిల్లీ సర్కారు కిందే పనిచేయాలన్నారు. పారదర్శకత అనే పునాదులపై పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ పూర్తి నిజాయితీతో సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అందువల్ల అభివృద్ధికి మార్గం సుగమమైందని చెప్పారు. ఢిల్లీని మహిళలకు సురక్షితమైన నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్లతో కలసి పనిచేస్తాం తమ ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ఎమ్సీడీలతో కలసి పనిచేస్తుందని చెప్పారు. అయితే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కావాలని స్థానికులు చాలాకాలంగా కోరుకుంటున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర కావాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రజలకు చౌకగా ఇళ్లు అందించాలంటే ఢిల్లీ అభివృద్ధి స్థానిక సర్కారు కిందే ఉండాలని ఆయన చెప్పారు. మహిళలకు భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం అందేలాచేయడం కోసం తమ ప్రభుత్వం మరిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తుందని చెప్పారు. ఢిల్లీని వైఫై ఆధారిత డిజిటల్ రాజధానిగా మారుస్తామని చెప్పారు. నగరాన్ని పెట్టుబడిదారులకు సన్నిహితంగా మార్చడంద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని నజీబ్ జంగ్ చెప్పారు. తమ సర్కారు కొత్త ఆరోగ్య కేంద్రాలను తెరుస్తుందని తెలిపారు. కొత్త కళాశాలలను నెలకొల్పుతామన్నారు. దాడులను తగ్గించి వ్యాపారులకు వేధింపుల నుంచి ఉపశమనం కలిగిస్తామని చెప్పారు. గ్రామాల అభివ ద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిపెడుతుందని పేర్కొన్నారు. -
అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లుపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో తిరస్కారానికి గురైంది. దాంతో సీఎం కేజ్రీ వాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బిల్లు ప్రవేశపెట్టడానికి జరిపిన ఓటింగ్ లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు తిరస్కారానికి గురికావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. దాంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదని ప్రకటించిన స్పీకర్ ప్రకటించారు. సాధారణ ఎజెండా ప్రకారం సభ కొనసాగుతోంది. ప్రస్తుతం బడ్జెట్‌పై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. -
ఢిల్లీ అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లు
న్యూఢిల్లీ: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సలహాను బేఖాతరు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టారు. 'సభలో బిల్లును ప్రవేశపెట్టాం. బిల్లుపై సానుకూల చర్చ జరుగుతుంది' అని సభ వాయిదా పడిన తర్వాత న్యాయశాఖ మంత్రి సోమ్ నాత్ భారతి మీడియాకు వెల్లడించారు. సభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్పీకర్ ఎంస్ ధీర్ ను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. దాంతో సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. అవినీతిని తుదముట్టేంచేందుకు జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. -
‘జన్‌లోక్‌పాల్’ నచ్చితేనే మద్దతు
న్యూఢిల్లీ: అన్నాహజారే ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన జన్‌లోక్‌పాల్ బిల్లుకే తాను అసెంబ్లీలో మద్దతు ఇస్తానని.. లేకుంటే బిల్లుకు మద్దతు ఇవ్వడంలో పునరాలోచన చేస్తానని ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ స్పష్టం చేశారు. మద్దతు విషయంలో తనను ఏ పార్టీ విప్ ఆపలేదని తేల్చిచెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో శుక్రవారం చర్చకు రానున్న జన్‌లోక్‌పాల్ బిల్లుపై తన ఓటు హక్కు గురించి స్పీకర్ ఎంఎస్ ధిర్‌తో సంప్రదించానని చెప్పారు. కాగా, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ పార్టీ నుంచి బహిష్కృతులైన ఎమ్మెల్యేలైనా.. అసెంబ్లీలో ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలని స్పీకర్ సమాధానమిచ్చారన్నారు. అయితే ఇదే విషయమై 2010లో సుప్రీం కోర్డు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏ ఎమ్మెల్యే కూడా తాను బహిష్కృతమైన పార్టీకే అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని లేదని స్పష్టంగా ఉందన్నారు. తనకు ఆ విషయాన్ని స్పీకర్ తెలియజేయలేదని ఆయన చెప్పారు. దాంతో 2010 సుప్రీం ఆర్డర్ గురించి తనకు ఎందుకు సమాచారమివ్వలేదో 24 గంటల్లోగా సమాధానమివ్వాలని స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే కోర్టుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ఇంతవరకు ఆ బిల్లు ప్రతిని చూడలేదన్నారు. అయితే అది అన్నాహజారే పోరాట స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే మద్దతు ఇస్తానన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని తనను ఎవరూ బలవంతపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. -
జన్‌లోక్‌పాల్ ఆమోదంపొందకుంటే తప్పుకుంటా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఎంతవరకైనా వెళ్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వరం పెంచారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. కేజ్రీవాల్ ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘బిల్లుకు అసెంబ్లీతో ఆమోదముద్ర వేయించుకోక పోతే నాకు పదవిలో కొనసాగే అర్హత లేదు. దేశాన్ని అవినీతిరహితం చేయడానికి సీఎం పదవిని వందసార్లు త్యాగం చెయ్యొచ్చు’ అని అన్నారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతిస్తామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ లవ్లీ చెప్పారు. -
హజారే దీక్షకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, ముంబై: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్‌జన్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తన స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో చేస్తున్న దీక్షకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. హజారే దీక్ష శుక్రవారం నాలుగవ రోజుకి చేరుకుంది. హజారే చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చేందుకు శుక్రవారం ఆర్మీ మాజీ చీఫ్ వి. కె. సింగ్ రాలేగావ్‌సిద్ధి చేరుకున్నారు. అన్నా హజారేతో భేటీ అనంతరం ఆందోళనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో అక్కడే దీక్షలో కూర్చుని ఉన్న ఆప్ అభిమాని గోపాల్ రాయ్ దీనికి అభ్యంతరం చెప్పారు. దాంతో కొంతసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన హజారే వెంటనే మైక్ తీసుకుని గోపాల్ రాయ్‌ని మందలించారు. ‘నిన్ను ఇక్కడ దీక్షలో పాల్గొనమని ఎవరు పిలిచారు?.. ఎందుకు సింగ్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నావు.. ఇక్కడ తమాషాలు చేయొద్దు.. ఏమైనా చేద్దాం అనుకుంటే బయటకు వెళ్లి చేసుకో..’ అని హజారే ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేది లేక రాయ్ మౌనం వహించాడు. దీంతో హజారేకు, ఆప్‌కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయినట్లయ్యింది. మద్దతు పలికిన ఎమ్మెన్నెస్.. హజారే దీక్షకు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచే కాక రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించడం ప్రారంభమైంది. శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అన్నాహజారే ఆందోళనకు మద్దతు పలికింది. ఆ పార్టీ నాయకుడు బాలానాంద్‌గావ్కర్ శుక్రవారం ఉదయం రాలేగావ్‌సిద్ధికి చేరుకుని అన్నాహజారేతో భేటీ అయ్యారు. అనంతరం కొంతసేపు ఆందోళనలో పాల్గొన్నారు. క్షీణిస్తున్న హజారే ఆరోగ్యం... దీక్ష చేస్తున్న హజారే ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అతడిని పరీక్షించిన డాక్టర్లు, గత మూడు రోజుల్లో అన్నా హజారే 3.2 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు. బీపీ నార్మల్‌గానే ఉన్నప్పటికీ దీక్షను కొనసాగిస్తే ప్రమాదం తప్పదన్నారు. అయితే దీక్షపై వెనక్కి తగ్గేది లేదని హజారే స్పష్టం చేశారు. తాను బాగానే ఉన్నానని పేర్కొంటూ మరో అయిదు రోజులవరకు తనకు ఏమీ కాదన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏడు కిలోలకుపైగా బరువుతగ్గినప్పటికీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నా తెలుపుతున్నారు. అయితే అన్నాహజారే ఆరోగ్యం గురించి రాలేగావ్‌సిద్ధి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.