హజారే దీక్షకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, ముంబై: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే లోక్‌జన్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తన స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధిలో చేస్తున్న దీక్షకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. హజారే దీక్ష శుక్రవారం నాలుగవ రోజుకి చేరుకుంది. హజారే చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చేందుకు శుక్రవారం ఆర్మీ మాజీ చీఫ్ వి. కె. సింగ్ రాలేగావ్‌సిద్ధి చేరుకున్నారు. అన్నా హజారేతో భేటీ అనంతరం ఆందోళనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో అక్కడే దీక్షలో కూర్చుని ఉన్న ఆప్ అభిమాని గోపాల్ రాయ్ దీనికి అభ్యంతరం చెప్పారు. దాంతో కొంతసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన హజారే వెంటనే మైక్ తీసుకుని గోపాల్ రాయ్‌ని మందలించారు. ‘నిన్ను ఇక్కడ దీక్షలో పాల్గొనమని ఎవరు పిలిచారు?.. ఎందుకు సింగ్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నావు.. ఇక్కడ తమాషాలు చేయొద్దు.. ఏమైనా చేద్దాం అనుకుంటే బయటకు వెళ్లి చేసుకో..’ అని హజారే ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేసేది లేక రాయ్ మౌనం వహించాడు. దీంతో హజారేకు, ఆప్‌కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయినట్లయ్యింది.
మద్దతు పలికిన ఎమ్మెన్నెస్..
హజారే దీక్షకు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచే కాక రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించడం ప్రారంభమైంది. శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అన్నాహజారే ఆందోళనకు మద్దతు పలికింది. ఆ పార్టీ నాయకుడు బాలానాంద్‌గావ్కర్ శుక్రవారం ఉదయం రాలేగావ్‌సిద్ధికి చేరుకుని అన్నాహజారేతో భేటీ అయ్యారు. అనంతరం కొంతసేపు ఆందోళనలో పాల్గొన్నారు.
క్షీణిస్తున్న హజారే ఆరోగ్యం...
దీక్ష చేస్తున్న హజారే ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అతడిని పరీక్షించిన డాక్టర్లు, గత మూడు రోజుల్లో అన్నా హజారే 3.2 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు. బీపీ నార్మల్‌గానే ఉన్నప్పటికీ దీక్షను కొనసాగిస్తే ప్రమాదం తప్పదన్నారు.
అయితే దీక్షపై వెనక్కి తగ్గేది లేదని హజారే స్పష్టం చేశారు. తాను బాగానే ఉన్నానని పేర్కొంటూ మరో అయిదు రోజులవరకు తనకు ఏమీ కాదన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏడు కిలోలకుపైగా బరువుతగ్గినప్పటికీ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నా తెలుపుతున్నారు. అయితే అన్నాహజారే ఆరోగ్యం గురించి రాలేగావ్‌సిద్ధి గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.