అన్నా హజారే బృందానికి.. ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. లోక్పాల్ బిల్లు కోసం నాలుగో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారేను పలకరించేందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ని హజారే.. అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్తో వాగ్వాదం ఫలితంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వీకే సింగ్ ఆమ్మ ఆద్మీ పార్టీ పేరు గానీ, కేజ్రీవాల్ పేరుగానీ ప్రస్తావించకుండానే విమర్శలు మొదలుపెట్టడంతో ''ఎందుకు అడ్డుకుంటున్నారు? గొడవ చేయాలనుకుంటే, ఇక్కడినుంచి వెళ్లిపోవచ్చు'' అని గోపాల్ రాయ్తో హజారే అన్నారు. బహిరంగ సభ వేదికపైనే 'ఆప్' నాయకుడు ఒకరిని హజారే ఇలా అనడంతో ఇద్దరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.
హజారేతో పాటు వేదిక పంచుకున్న వీకే సింగ్ మాట్లాడుతూ, అవినీతిపై పోరాటానికి మనం వేర్వేరు బృందాలుగా విడిపోకూడదని చెప్పారు. దీనికి రాయ్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అన్నాహజారే కలగజేసుకుని రాయ్ని వెంటనే రాలెగావ్ సిద్ధి వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. ''దీక్ష చేయాలని మిమ్మల్ని అడగలేదు. గొడవ చేయాలనుకుంటే రాలెగావ్ సిద్ధి వదిలి పోవచ్చు'' అని చెప్పారు.
అన్నా- ఆప్ మధ్య భగ్గుమన్న విభేదాలు
Published Fri, Dec 13 2013 3:53 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement