కేజ్రీవాల్ ప్రధాని కావాలనుకున్నారు: హజారే
రాలేగావ్ సిద్ది: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలని ఆశ పడ్డారని అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అన్నా హజారే తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడం కేజ్రీవాల్ చేసిన పొరపాట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యమ పంథా వదలొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదని వాపోయారు.
ఢిల్లీ సీఎం అయిన తర్వాత కేజ్రీవాల్ ను ఒకసారి కలిసినట్టు హజారే తెలిపారు. ఢిల్లీకి పరిమితం కావాలని, జాతీయస్థాయిలో రాజకీయాల గురించి అప్పుడే ఆలోచించొద్దని సలహాయిచ్చానని చెప్పారు. అయితే తన సూచనను కేజ్రీవాల్ పట్టించుకోలేదన్నారు. ఆప్ ఒంటెత్తు పోకడలు ఉన్నాయని, పరిస్థితి మారకుంటే ఆ పార్టీ మనుగడ కష్టమని హజారే అన్నారు.