‘జన్‌లోక్‌పాల్’ నచ్చితేనే మద్దతు
Published Fri, Feb 14 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
న్యూఢిల్లీ: అన్నాహజారే ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన జన్‌లోక్‌పాల్ బిల్లుకే తాను అసెంబ్లీలో మద్దతు ఇస్తానని.. లేకుంటే బిల్లుకు మద్దతు ఇవ్వడంలో పునరాలోచన చేస్తానని ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ స్పష్టం చేశారు. మద్దతు విషయంలో తనను ఏ పార్టీ విప్ ఆపలేదని తేల్చిచెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో శుక్రవారం చర్చకు రానున్న జన్‌లోక్‌పాల్ బిల్లుపై తన ఓటు హక్కు గురించి స్పీకర్ ఎంఎస్ ధిర్‌తో సంప్రదించానని చెప్పారు. కాగా, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ పార్టీ నుంచి బహిష్కృతులైన ఎమ్మెల్యేలైనా.. అసెంబ్లీలో ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలని స్పీకర్ సమాధానమిచ్చారన్నారు.
అయితే ఇదే విషయమై 2010లో సుప్రీం కోర్డు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏ ఎమ్మెల్యే కూడా తాను బహిష్కృతమైన పార్టీకే అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని లేదని స్పష్టంగా ఉందన్నారు. తనకు ఆ విషయాన్ని స్పీకర్ తెలియజేయలేదని ఆయన చెప్పారు. దాంతో 2010 సుప్రీం ఆర్డర్ గురించి తనకు ఎందుకు సమాచారమివ్వలేదో 24 గంటల్లోగా సమాధానమివ్వాలని స్పీకర్‌కు లేఖ రాశానన్నారు.
అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే కోర్టుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ఇంతవరకు ఆ బిల్లు ప్రతిని చూడలేదన్నారు. అయితే అది అన్నాహజారే పోరాట స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే మద్దతు ఇస్తానన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని తనను ఎవరూ బలవంతపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Advertisement