సాక్షి, న్యూఢిల్లీ: ఎండతీవ్రత పెరగడంతో నెలకొం టున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. రాజ్‌నివాస్‌లో నిర్వహించిన సమావేశంలో డివిజినల్ కమిషనర్, 11 జిల్లాలతో డిప్యూటీ కమిషనర్లకు ఈమేరకు సూచించారు. అన్ని పథకాలకు సంబంధించి ప్రజలకు నిర్థిష్ట కాల పరిమితితో సేవలందించాలని పేర్కొన్నారు. స్థానికంగా పర్యటనలు చేపట్టేలా ఆయా జిల్లాల అధికారులను పంపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలన్నారు. స్థానిక సమస్యల ప్రాతిపదిక నివేదికలు అందజేయాలని కోరారు. ప్రతి పదిహేను రోజులకు ఓసారి రాజ్‌నివాస్‌లో సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. జుగ్గీజోపిడీలు, అనధికారిక కాలనీల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఆదర్శవంతంగా ప్రజాసేవలో ముందుండాలని అధికారులకు ఆదేశించారు.
వర్షాలకూ సన్నద్ధమవుతున్న కార్పొరేషన్
మరోవైపు వర్షాకాలం రాగానే ఢిల్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం... నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అతి పురాతనమైనది కావడం, అంతసమర్ధవంతమైనది కాకపోవడం. దీంతో వర్షపు నీరు బయటకు పోలేక కాలనీల్లోనే నిలిచిపోతుంది. వర్షాకాలంలో నగరం నీటి ప్రపంచాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నీటిపారుదల, వరద నివారణ శాఖ, ఢిల్లీ మున్సిపల్ కర్పారేషన్ సంయుక్తంగా నీరు నిలవకుండా ఉండేందుకు, రవద నీటిని అదుపు చేసేందుకు ప్రతి ఏటా ముందస్తు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా వర్షపు నీటి కాలువల శుద్ధి, మరమ్మతులు, నీటి పైపులను శుద్ధి, మరమ్మతులు, నగరంలోని 12 మున్సిపల్ జోన్లలో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఈశాన్య మున్సిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి యోగేంద్ర మన్ తెలిపారు.
‘ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రారంభించాం. నిలిచిపోయిన నీటిని తోడి పారబోయడానికి కొత్త పంపులను కూడా ఏర్పాటు చేశాం. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని యోగేంద్ర చెప్పారు. అన్ని విభాగాలు కలిసి ఈ ఏడాది వానాకాలంలో వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, జూన్ 15కల్లా పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అయితే డ్రైనేజ్ కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు పడేయకుండా ఉండాలని యోగేంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ఏరియా, బరఫ్ ఖానా చౌక్, ఐఎస్‌బీటీ కష్మీరీ గేట్, రైల్వేబ్రిడ్జ్, సబ్జీమండీ, షాద్రా, జేజే బులంద్ మసీదు, మానస సరోవర్ పార్క్, బాదర్‌పూర్ రోడ్, ఖిచ్రిపూర్, మండవలిలను అత్యంత దుర్భలమైన ప్రాంతాలుగా గుర్తించింది కార్పొరేషన్. చిన్నవర్షం పడినా చిత్తడిగా మారే ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
సత్వర చర్యలు తీసుకోండి
Published Thu, May 1 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement