ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్(ఫైల్), కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెం ట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలకు కత్తెర వేసిన న్యాయ స్థానం.. ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగానే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటిం చింది.
ఢిల్లీ రాష్ట్రం కాదని, ప్రస్తుతమున్న రాజ్యాంగ పరిమితుల్లో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కీలక తీర్పును ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిని స్పష్టంగా వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ సర్కారు పై చేయి సాధించినట్లయ్యింది.
నేపథ్యం ఇదీ..: 2014లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కినప్పటి నుంచి కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌జంగ్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభేదిస్తూ వచ్చారు. వారు కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఎల్జీ కేంద్రం అండ చూసుకుని తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అనేక అప్పీళ్లు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239ఏఏతో ముడిపడి ఉన్న అనేక విషయాలకు తాజా తీర్పుతో జవాబిచ్చింది.
ఎల్జీ పాలనాధికారి మాత్రమే..
సీజేఐ జస్టిస్ మిశ్రా తన తరఫున, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ తరఫున 237 పేజీల తీర్పును వెలువరించింది. ‘ప్రస్తుత రాజ్యాంగ పరిమితుల మేరకు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదు. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రత్యేకమైనది. భిన్నమైనది. లెఫ్టినెంట్ గవర్నర్ హోదా.. రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదు. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే. పరిమితార్థంలో ఎల్జీ హోదాలో ఆయన పని చేస్తారంతే’ అని సీజేఐ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు.
మంత్రిమండలితో ఘర్షణ పూరిత వైఖరితో కాకుండా ఎల్జీ సంధానకర్త లాగా వ్యవహరించాలని, ఎల్జీకి, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు పరిధి దాటకూడదని, వాటిని చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకో వాలంది. ‘ఎల్జీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఎటువంటి అధికారం లేదు. ఆయన మంత్రిమండలి సలహాలు, సూచనల ఆధారంగా పనిచేయాలి. లేదా ఆయన సూచనల మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి’అని పేర్కొన్నారు. మంత్రిమండలి తీసుకునే ప్రతి నిర్ణయం ఎల్జీకి తెలియజేయాలని, అయితే ప్రతి అంశంలోనూ ఎల్జీ ఆమోదం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూములు ఈ మూడు అంశాలు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉందన్నారు.
నిర్ణయాలు తీసుకునేది కేబినెట్..
జస్టిస్ డీవై చంద్రచూడ్ వెలువరించిన 175 పేజీల అనుబంధ తీర్పులో నిర్ణయాలు తీసుకునేది ఎల్జీ కాదని, మంత్రిమండలి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎల్జీ గుర్తుపెట్టుకోవా లన్నారు. రాష్ట్రపతి నిర్ణయానికి కూడా ఎల్జీ బద్ధుడై ఉండాలని తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన 123 పేజీల అనుంబంధ తీర్పులో ఎన్నికైన∙ప్రజాప్రతిని ధులకు ఢిల్లీ శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి అభిప్రాయాలు, నిర్ణయాలను అన్ని సమయా ల్లోనూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీ ప్రజల విజయం: కేజ్రీవాల్
అధికారం కోసం కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన ‘ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా: చిదంబరం
సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఘన విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన చిదంబరం అన్నారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందన్నారు. ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి దక్కిన ఘన విజయం. క్లీన్ చిట్ ఉన్న లెఫ్టినెంట్ అనిల్ బైజాల్.. రాజకీయ గురువుల మాట విని తప్పుడు మార్గంలో ఎందుకు నడిచారు?’ అని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చిదంబరం ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.
నష్టం జరిగినా కేజ్రీవాల్‌కు పండుగే: బీజేపీ
తన ప్రభుత్వానికి పూర్తి అధికారాలివ్వాలన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆయన పండుగ చేసుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం, ఎల్జీ మధ్య జరుగుతున్న అధికార పోరాటంలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ గౌరవాన్ని నిలబెట్టింది. కేబినెట్ నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగానికి తన కిష్టమైన అర్థాన్ని చెప్పడం కేజ్రీవాల్ నైజం. నష్టపోయినా ఉత్సవాలు జరుపుకునేదెవరంటే కేజ్రీవాల్ అనే సమాధానం వస్తుంది’ అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదీ ‘ఢిల్లీ’ చరిత్ర...
న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాం నుంచి నేటి వరకు ఢిల్లీ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలివీ.. బ్రిటిష్ పాలకులు 1911లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ సమయంలో ఢిల్లీకి అధినేతగా ఓ కమిషనర్‌ను నియమించి, దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ అని పిలిచేవారు. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఢిల్లీని పార్ట్–సీ రాష్ట్రంగా మార్చారు. అక్కడ అసెంబ్లీ ఏర్పాటుచేయడానికి ప్రత్యేక చట్టం చేశారు. పార్ట్– ఏ,బీ,సీ,డీ రాష్ట్రాలను రద్దుచేస్తూ 1956, అక్టోబర్ 19న రాష్ట్రాల పునర్విభజన చట్టానికి ఆమోదం లభించింది.
ఫలితంగా దేశంలోని ప్రాంతాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. దీనిలో భాగంగా, రాష్ట్రపతి నియమించే వ్యక్తి పాలించేలా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైంది. ఢిల్లీ శాసనసభ, శాసనమండలి రద్దయ్యాయి. ఆ తరువాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు, మంత్రి మండళ్లను ఏర్పాటుచేసేందుకు 1963లో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ చేశారు. అయితే ఈ చట్టాన్ని ఢిల్లీకి వర్తింపచేయలేదు. కానీ, 1966 నాటి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చట్టం ప్రకారం..56 మంది ఎన్నికైన సభ్యులతో కూడిన మెట్రోపాలిటన్ కౌన్సిల్, ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో పరిమిత ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని కల్పించారు.
గవర్నర్/అడ్మినిస్ట్రేటర్/చీఫ్ కమిషనర్ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటూ రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని 1966, ఆగస్టు 20న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీకి ఏ హోదా ఇవ్వాలన్న విషయమై 1987లో బాలక్రిష్ణన్ కమిటీని నియమించారు. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగానే సాగిస్తూ, శాసనసభ, మంత్రిమండలిని ఏర్పాటుచేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, స్థిరత్వం కోసం ప్రత్యేక హోదా ఇచ్చేలా రాజ్యాంగపర చర్యలు తీసుకోవాలంది. ఫలితంగా 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేపట్టి, నిబంధన 239ఏఏ (ఢిల్లీకి ప్రత్యేక నిబంధనలు), 239ఏబీ(రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైన సందర్భాలు)లను చేర్చారు.
నాలుగేళ్ల క్రితమే వివాదానికి బీజాలు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)తో రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదానికి బీజాలు నాలుగేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో గ్యాస్ ధరలను ఏకపక్షంగా నిర్ణయించారంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మురళీ దేవ్‌రా తదితరులపై కేజ్రీవాల్ కేసు పెట్టారు.
► 2014, మే 2: ఈ కేసును కొట్టేయాలంటూ రిలయన్స్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం ఢిల్లీ ఏసీబీకి ఇస్తూ 1993లో కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేసింది.
► 2014 మే 8: కేంద్ర మంత్రుల కేసులపై విచారణ అధికారం ఏసీబీకి ఇవ్వడాన్ని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
► 2014 ఆగస్టు 19: గ్యాస్ ధరల నిర్ణయంపై కేంద్ర మంత్రులతోపాటు రిలయన్స్‌పై పెట్టిన కేసుల దర్యాప్తు పరిధి నుంచి కేంద్రం తమను తప్పించిందని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది.
► 2015 జూన్ 27: ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనాను ఏసీబీ ఆఫీసులోకి ప్రవేశించనీయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసింది.
► 2016 ఆగస్ట్ 4: ఎల్జీ కేబినెట్ సలహా మేరకు పనిచేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
► 2016 సెప్టెంబర్ 9: ఈ తీర్పుపై ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించింది.
► 2017 డిసెంబర్ 6: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదావేసింది.
ఓటుహక్కుది చిరస్థాయి: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు చిరస్థాయిగా నిలిచిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దేశం తమదేననే భావనను అది ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు కోత పెడుతూ వెలువరించిన చారిత్రక తీర్పులో ఈ విధంగా స్పందించింది. ప్రజ ల ఆకాంక్షలు అమలయ్యేలా చూడటం అవసరమంది. ‘ఓటుహక్కు ప్రాథమిక హక్కు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అది గుండెకాయ స్థానంలో ఉంటుంది’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment