కూటమికే పట్టం
జేడీఎస్, స్వతంత్రుల సహకారంతో బీబీఎంపీ మేయర్ స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్
ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా... బీజేపీకి తప్పని భంగపాటు ఉత్కంఠగా సాగిన ఎంపిక
కీలక స్థానాలను దక్కించుకున్న స్వతంత్రులు
ఉప మేయర్ స్థానం జేడీఎస్‌కు మేయర్‌గా మడివాళ కార్పొరేటర్ మంజునాథరెడ్డి
బెంగళూరు : నగరంతో పాటు రాష్ట్రంలో తీవ్ర కుతూహలం రేకెత్తించిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ ఎన్నికల్లో చివరికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయఢంకా మోగించింది. అన్ని అడ్డంకులను దాటుకుని మేయర్, ఉపమేయర్ స్థానాలను ఈ రెండు పార్టీలు కైవసం చేసుకోగా పన్నెండిటిలో ఏడు స్థాయీ సమితి అధ్యక్ష స్థానాలను మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. దీంతో బీబీఎంపీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ వార్డుల్లో గెలిచిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. బెంగళూరులో మేయర్, ఉపమేయర్ ఎన్నిక కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగర 49వ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకు చెందిన మడివాళ కార్పొరేటర్ మంజునాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపమేయర్ పదవిని వృషభావతి వార్డు జేడీఎస్ కార్పొరేటర్ హేమావతి గోపాలయ్య దక్కించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారం ఉదయం కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కూటమి నుంచి మేయర్ స్థానానికి మంజునాథ్‌రెడ్డి, ఉపమేయర్ స్థానానికి హేమలతా నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ తరఫున ఈ రెండు స్థానాలకు వరుసగా మంజునాథరాజు, హెచ్‌సీ నాగరత్న నామినేషన్లు వేశారు. అనంతరం ఈ సారి బీబీఎంపీ ఎన్నికల్లో గెలిచిన 198 కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్ర హై కోర్టు ఆదేశాలను అనుసరించి మేయర్, ఉపమేయర్ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు నగర ప్రాంతీయ కమిషనర్ ఎం.వి.జయంతి బీబీఎంపీ సభలో వెల్లడించారు. అటు మేయర్ స్థానానికి పోటీపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంజునాథ్‌రెడ్డి, బీజేపీ నాయకుడు మంజునాథరాజులలో ఎవరిని ఎవరు సమర్థిస్తున్నారో చెప్పాల్సిందిగా జయంతి కార్పొరేటర్లకు సూచించారు. దీంతో మంజునాథ్‌రెడ్డిని సమర్థిస్తూ 131 మంది ప్రజాప్రతినిధులు చేతులు పైకి లేపగా మంజునాథరాజుకు 128 మంది మద్దతు లభించింది. దీంతో మేయర్‌గా మంజునాథరెడ్డి ఎన్నికైనట్లు జయంతి ప్రకటించారు. అదేవిధంగా హేమలతా గోపాలయ్య కూడా 131 మంది మద్దతుతో ఉపమేయర్ పదవిని దక్కించుకున్నారు.
అందరూ హాజరు...
కర్ణాటక మునిసిపల్ కార్పొరేషన్ యాక్ట్‌ను అనుసరించి మేయర్ ఎన్నిక విషయంలో కార్పొరేటర్లకే కాకుండా బీబీఎంపీ పరిధిలోని ప్రజాప్రతినిధులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ కంటే కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్, స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ మేయర్ పదవిని దక్కించుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జరిగిన ఎన్నికలో ఆ పార్టీకు చెందిన అందరు నాయకులూ మేయర్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఇక మేయర్ పదవిపై చివరి క్షణం వరకూ ఆశలు వదులుకోని బీజేపీ అధినాయకులు తమ పార్టీకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అటు కాంగ్రెస్-జేడీఎస్ కూటమితో పాటు బీజేపీకు చెందిన అందరు నాయకులు హాజరు కావడంతో బీబీఎంపీ కార్యాలయం మొత్తం ఫుల్ అడెండెన్స్‌తో కళకళలాడింది.