కాంగ్రెస్ నిరసన ప్రదర్శన
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ సరఫరాలో కోత, నీటి ఎద్దడి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనను కొనసాగిస్తూనే ఉంది. ఇందులోభాగంగా ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం బీజేపీ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ కుండలను పగులగొట్టి నిరసన ప్రకటించారు. ఇదిలా ఉండగా విద్యుత్ కోత, నీటి కటకట మరోసారి ప్రజల ముందుకు రావడానికి, తమ ఉనికిని చాటుకోవడానికి చక్కని అవకాశామిచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తుం డగా బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇది తలనొప్పిగా పరిణమించింది.
ఈ సమస్యలపై తలెత్తుతోన్న ప్రజాగ్రహం వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలు చేస్తుందేమోనన్న భయం బీజేపీ నేతలను వెన్నాడుతోంది. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉండడం, ఢిల్లీలో రాష్ట్రపతిపాన కొనసాగుతుండడంతో ఈ సమస్యలపై నిరసన వ్యక్తం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆందోళనకు దిగుతున్న నగరవాసులకు తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకుంటూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తోంది.
ఘజియాబాద్‌వాసుల నిరసన ప్రదర్శన
ఘజియాబాద్: గంటల తరబడి విద్యుత్ కోతలపై ఘజియాబాద్ వాసులు మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ప్రతాప్ విహార్ ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవినగర్, రాజ్‌నగర్, ప్రతాప్‌విహార్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం కుసుమ్‌నగర్ ప్రాంతవాసి ఒకరు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్య తీవ్రంగా ఉందన్నారు.
ప్రతిరోజూ ఐదు నుంచి ఎనిమిది గంటలమేర మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందన్నారు, దీంతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మరో బాధితుడు సంజయ్‌సింగ్ మాట్లాడుతూ ఏదైనా సమస్య తలెత్తిన పుడు ఫిర్యాదుచేసినా దాన్ని సరిదిద్దేందుకు సంబంధిత అధికారులు ఐదు లేదా ఆరు గంటల సమయం తీసుకుంటున్నారన్నారు. దీంతో తాము నిద్ర లేని రాత్రులను గడపాల్సి వస్తోందన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరంతర ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.