- నమ్మించి మహిళను లొంగదీసుకుని దగా
- డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
కదిరి టౌన్:చట్టాన్ని రక్షిస్తూ.. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుని.. ఆపై వంచించాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కదిరి పట్టణ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. శనివారం బాధితురాలు మీడియాకు ఈ వివరాలు వెల్లడించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మేరీ(38) కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.
మదనపల్లిలోనే ఆమె ఆదర్శ ఉమెన్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. అప్పట్లో తన సంస్థ కార్యక్రమాలకు కదిరి ఎమ్మెల్యే షాజహాన్‌ను ఆహ్వానిస్తుండేది. అప్పట్లో ఆయన వద్ద గన్‌మెన్‌గా ఉన్న వివాహితుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు(పీసీ-141) మేరీతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యేతో చెప్పి చేయిస్తానంటూ ఆశ చూపాడు.
అనంతరం నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు. ఏడాది క్రితం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో.. తనకు తిండితో ఇబ్బందిగా ఉందని, కదిరికి వచ్చి తనతో పాటు ఉండాలని మేరీని కోరాడు. కానీ తన సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, తర్వాత కొందరితో చెప్పించడంతో ఒప్పుకుంది. దీంతో మే 23న కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.
ఈ విషయం తెలిసి సదరు కానిస్టేబుల్ సోదరుడు వెంకటస్వామి, అతని ఇరువురు కుమారులు ఇటీవల మేరీ ఇంట్లోకి చొరబడి నానా దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం చేశారు. ఆంజనేయులు సైతం తనను కులం పేరుతో దూషిస్తూ.. ఇకపై నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు.. జరిగిన విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి, వస్తువులు చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు డీఎస్పీ ఎదుట వాపోయింది.
తనకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని, నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కానిస్టేబుల్ ఆంజనేయులుపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ దేవదానం, పట్టణ ఎస్‌ఐ-2 రహిమాన్ తెలిపారు.