Womens Police
-
ఉమెన్ గ్రూప్ 1
నవ్యాంధ్ర తొలి డీఎస్పీ బ్యాచ్‌లోని 25 మందిలో 12 మంది మహిళలు చోటు దక్కించుకుని కొత్త చరిత్ర సృష్టించిన సందర్భం ఇది. వీరంతా ఇప్పుడు విధులకు సిద్ధం అవుతున్నారు. సమాజానికి రక్షణ కవచంగా యూనిఫామ్ ధరించబోతున్నారు. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన మూడు సింహాలతో కలిసి కర్తవ్య నిర్వహణ నాలుగో సింహంగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాను. కరకు ఖాకీ వృత్తి మగవాళ్లకే పరిమితమన్న వాదనకు చెల్లుచీటి రాస్తూ ‘మేము సైతం’ అంటూ సత్తా చాటేందుకు సంసిద్ధులయ్యారు. ఉన్నత చదువులతో ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేసిన ఈ మహిళా డీఎస్పీలు మహిళావనికే ఆదర్శం. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ చదువులు పూర్తి చేసిన ఈ పన్నెండు మందీ ఏదో బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు బరిలో దిగారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోని ఐఏఎస్ అకాడమీల్లో రేయింబవళ్లు విరామమెరుగకుండా శ్రమించారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమైన వీరంతా.. అంతకంటే ముందుగా వచ్చిన గ్రూప్–1 పరీక్ష రాశారు. విశేషం ఏమిటంటే ఉన్నతమైన సివిల్స్‌కు కోచింగ్ తీసుకున్న వారు గ్రూప్–1 పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఎటువంటి కోచింగూ లేకుండానే నెగ్గుకొచ్చారు. సివిల్స్ కొట్టాలనుకుని గ్రూప్–1కు ఎంపికై డీఎస్పీ పోస్టును సాధించిన వారిలో కొందరు మాత్రం ఏమైనా సివిల్స్‌కు వెళ్తామంటున్నారు. పోలీసు ఉద్యోగంతో సమాజానికి నేరుగా సేవ చేసే భాగ్యం దక్కిందని మరికొందరు ఇక్కడికే పరిమితమవుతున్నారు. వీరిలో కొందరిని సా„ì పలకరించింది. వారి మనోభావాలను తెలుసుకుంది. యూనిఫాం చూసుకుని గర్వపడుతున్నా ఖాకీ యూనిఫాం వేసుకోవడానికి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను బీటెక్ చదివాను. గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపిక కావడాన్ని ఎప్పటిక మరిచిపోలేను. నా తల్లిదండ్రులు లలిత, ఎస్ఏ బషీర్, నా భర్త షఫీ, నా మావయ్య వన్నూర్ సాహెబ్ (రిటైర్డ్ ఏఎస్పీ) అందించిన ప్రోత్సాహం మరువలేను. వృత్తిపరంగా ప్రతీ రోజు నేను వేసుకున్న ఖాకీ యూనిఫాంకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ఒక పోలీసుగా గర్వంగా ఫీలయ్యేలా సమాజానికి సేవ చేస్తాను. వ్యక్తిగతంగా మంచి కూతురు, మంచి తల్లి అన్పించుకునేలా ఉంటాను. –షేక్ షాను,రేణిగుంట, చిత్తూరు జిల్లా సివిల్ సర్వీసెస్ నా టార్గెట్ డీఎస్పీగా పనిచేస్తూ సివిల్ సర్వీసెస్‌లో రాణించాలన్నదే నా ముందున్న లక్ష్యం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌మెడల్ సా«ధించాను. స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా, ఏపీజెన్‌కోలో ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే నా పట్టుదలను చూసి నా తల్లిదండ్రులు ఎన్.చంద్రశేఖర్, బీవీ ఉమ, నా భర్త పీవీ రాఘవ నన్ను ప్రోత్సహించారు. నాకు రెండేళ్ల కూతురు హంసిక ఉంది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు డీఎస్పీ విధులు నిర్వర్తిస్తూ, అదే సమయంలో సివిల్స్ పై దృష్టి పెట్టి సాధిస్తాను. – ఎన్.రమ్య, తిరుపతి బాధితులకు న్యాయం జరిగేలా పనిచేస్తాను అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మా నాన్న ఎస్ఎం రమేష్‌చంద్ర రిటైర్డ్ డీఈఈ. అమ్మ ఎం.అనుపమ అనంతపురం కలెక్టరేట్లో తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. ఒక సోదరి కోటచెరువు మండలంలో డిప్యూటీ తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. మరో సోదరి సుస్మిత ఫ్యాషన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. డీఎస్పీగా విధుల్లో చేరిన నేను ఒక పోలీసుగా బాధితులకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తాను. – ఎస్.రమేష్ చంద్ర హర్షిత, అనంతపురం మా నాన్న జడ్జి కావడంతో.. నాకు పోలీస్ కావాలని ఉండేది మా నాన్న గాంధీ.. డిస్టిక్ట్ర్ అండ్ సెషన్స్ జడ్జి (హైదరాబాద్) కావడంతో ఆయన ప్రభావం నాపై ఉండేది. ఆయన నిత్యం కేసులు, విచారణలో బిజీగా ఉండటం చూసి నేను పోలీసు కావాలని అనుకునేదాన్ని. బీటెక్ పూర్తి చేసి, ఖాళీగా ఉండటం ఎందుకని ఐడియా సెల్యులార్ సర్వీసెస్ (హైదరాబాద్)లో కొంతకాలం జాబ్ చేశాను. సివిల్స్ సాధించాలని ఇటీవల ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. ఈ మధ్యలో గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీ సాధించాను. పోలీసు ఉద్యోగం అంటే ఇష్టపడే నేను నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఈ వృత్తిని వదులుకోను. అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు పోలీసు సేవలను అందించాలన్నదే నా లక్ష్యం. మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పనిచేస్తాను. – ఎం.శ్రావణి, కొవ్వూరు, పశ్చిమగోదావరి మా మండలంలో నాదే రికార్డు మా నాన్న గురుప్రసాద్ సాధారణ రైతు. మా అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఆడపిల్లనైనా నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2016–2018 మధ్య భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్–1 సా«ధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. మా ఓబులావారి మండలం మొత్తం మీద నేరుగా(డైరెక్ట్) గ్రూప్–1 సాధించిన ఘనత నాదే కావడం గర్వంగా ఉంది. ప్రజల సమస్యలు కళ్లారా చూసి వారికి న్యాయం చేసే అవకాశం ఉన్న పోలీసు అధికారిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే ఆశయంతో ముందుకు సాగుతాను. – ఎం.శ్రీలత, ఇందిరానగర్, వైఎస్సార్ కడప జిల్లా నాన్నే నాకు స్ఫూర్తి తిరుపతిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్యామ్ సుందరం మా నాన్న. పోలీసుగా ఆయనను దగ్గర నుంచి చూసిన నాకు పోలీసు కావాలనే లక్ష్యం ఉండేది. నేను డీఎస్పీగా ఎంపిక కావడానికి నాన్నే నాకు స్ఫూర్తిగా నిలిచారు. అమ్మ సునీత వినోదిని గృహిణిగా ఉంటూ నన్ను చదువులో ప్రోత్సహించేది. బీటెక్‌లో నేను గోల్డ్‌మెడల్ సాధించాను. సివిల్స్ సర్వీసెస్‌ను టార్గెట్‌గా పెట్టుకుని హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఈలోపు గ్రూప్–1 రాసి డీఎస్పీ పోస్టు సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఇక్కడితో ఆగిపోను. డీఎస్పీగా పనిచేస్తూ సివిల్స్ కొడతాను. ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తాను. పాజిటివ్‌గా పనిచేస్తే ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం పోలీసులకే ఉంది. నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న పోలీసు వృత్తి నాకు చాలా ఇష్టం. – ఇ.జెస్సీ ప్రశాంతి, తిరుపతి ప్రభుత్వ సర్వీసులో చేరాలన్నకోరిక నెరవేరింది ప్రభుత్వ సర్వీసులో చేరి ప్రజలకు సేవ చేయాలన్న నా లక్ష్యం నెరవేరింది. నేను డీఎస్పీ పోస్టు సాధించడంలో అమ్మా, నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సొంత ప్రాంతమైనప్పటికీ అమ్మా, నాన్నలకు ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నాం. నాన్న డాక్టర్ ఎస్.కిషోర్ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(తిరుపతి)లో ప్రొఫెసర్. అమ్మ కేఎం రోజ్మండ్ నెల్లూరులో డిప్యూటీ కలెక్టర్. వారి స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో పట్టుదలగా సాధించాను. – ఎస్.భవ్య కిషోర్, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా డీఎస్పీగా ఎక్కువ సేవలు అందించాలనుకున్నా.. మా నాన్న ధర్మరాయ్ ఆంధ్రా యూనివర్సిటీలో ఫార్మసిస్టు. మా అమ్మ అప్పల నర్సమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్. వారి ప్రోత్సాహంతోనే నేను రాణించాను. నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను. అయితే ప్రజలకు విస్తృతంగా అందు బాటులో ఉండటానికి డీఎస్పీ అవడం అవసరం అనుకున్నాను. పోలీసు అధికారిగా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు మేలైన సేవలు చేయాలన్నది నా సంకల్పం. –కె.స్రవంతి రాయ్, తురైగూడ, అరకు మండలం, విశాఖ 2018–19 బ్యాచ్ మహిళా డీఎస్పీలు ఎస్.రమేష్‌చంద్ర హర్షిత, ఎం.శ్రావణి, షేక్ షాను, ఎం. శ్రీలత,కె. లతకుమారి, ఎం. నాగ భార్గవి, ఎస్. శిరీషా, కె. స్రవంతిరాయ్, ఇ.జెస్సీ ప్రశాంతి, ఎస్. భవ్యకిషోర్, వై. శృతి, ఎన్. రమ్య – ఇరింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి ఫొటోలు: పి. విజయ్ కృష్ణ -
'షిం'హాలు
రఫ్ అండ్ టఫ్ జాబ్.. పోలీసుద్యోగం! క్రిమినల్స్‌ని డీల్ చెయ్యాలి. పాలిటిక్స్‌ని డీల్ చెయ్యాలి. పబ్లిక్‌లో ప్రతివాడికీ ఓ ‘పెద్దమనిషి’ ఉంటాడు. ఆ పెద్దమనిషినీ డీల్ చెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే.. ఎంత డేరింగ్‌గా ఉండాలి? ఎంత డోన్ట్ కేరింగ్‌గా ఉండాలి. సినిమాల్లో అయితే మహేష్ బాబు ‘పోలీస్’ అనగానే అంతా గప్‌చుప్ అయిపోతారు. ‘నేనేరా పోలీస్.. ఆ..’ అని సాయికుమార్ అనగానే.. అంతా సెట్‌రైట్ అయిపోతారు. రియల్ లైఫ్‌లో అలా నడవదు. నిజంగా అలా ఉండదా? ఉంటుంది.. ఇదిగో ఇలాంటి 'షిం'హాలు ఉంటే..పవరున్నవాడైనా, పొగరున్నవాడైనా దారికి రావాల్సిందే. ఇటీవలి కాలంలో అలా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే పేరు తెచ్చిన కొందరు మహిళా పోలీస్‌ల సాహసాలు.. స్వాభిమానాల సంఘటనలు, ప్రతిఘటనలు ఇవి. 1 శేష్ఠ ఠాకూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ,శ్యానా సర్కిల్ ఆఫీసర్ (బులంద్‌షహర్) 2017 జూన్ హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్న వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారు శ్రేష్ఠ. ‘పోనివ్వమ్మా.. పోలీసమ్మా’ అన్నారు బీజేపీ వాళ్లు సీన్లోకి వచ్చి. ‘మీరెవరు?’ అన్నారు శ్రేష్ఠ. ‘స్టేట్‌లో పవర్ మాదే’ అన్నారు వాళ్లు. ‘పవర్లో ఉన్నవాళ్లయితే పర్ఫెక్ట్గా ఉండాలి కదా’ అన్నారు శ్రేష్ఠ. బీజేపీ లీడర్స్‌కి, శ్రేష్ఠకీ గొడవైంది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. జూలైలో శ్రేష్ఠకు ట్రాన్స్ఫర్ అయింది! బులంద్‌షహర్ నుంచి ఆమెను బారైచ్ పంపించారు. శ్రేష్ఠపై బీజేపీ నాయకులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు కంప్లైంట్ చెయ్యగానే ఆయన వెంటనే ఏమీ యాక్షన్ తీసుకోలేదు. స్టేట్‌లో 244 మంది పోలీసు అధికారులకు బదలీలు అయ్యాయి. సింపుల్‌గా ఆ లిస్టులో శ్రేష్ఠ పేరును చేర్చారు. శ్రేష్ఠ వర్కింగ్ ఏరియా అయితే మారింది కానీ, ఆమె వర్కింగ్ స్పిరిట్ మారలేదు. బారైచ్‌కు బదలీ చేశాక ఫేస్బుక్లో ఇలా రాసుకున్నారు శ్రేష్ఠ. ‘బారైచ్‌కు ట్రాన్స్ఫర్ అయింది. ఈ ప్రాంతం నేపాల్ బార్డర్లో ఉంటుంది. డోన్ట్ వర్రీ మై ఫ్రెండ్స్. నేను సంతోషంగా ఉన్నాను. నా పనికి ఇది గుర్తింపుగా భావిస్తున్నాను. మీ అందరికీ బారైచ్‌కు నా ఆహ్వానం’. 2 మోనికా సేన్ ప్రొబేషనరీ ఐ.పి.ఎస్. ఆఫీసర్ జూలై 12, 2017 రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్‌ను ఎవరో చంపేశారు. ఆ ఘటన హింసకు దారి తీసింది. షాపుల్ని, బస్సుల్సీ, ప్రత్యర్థి గ్యాంగ్ అనుచరుల ఇళ్లను ధ్వంస చేస్తున్నారు ఆనంద్‌పాల్ మనుషులు. శాంతిభద్రతల్ని అదుపు చెయ్యడం కోసం ఆనంద్‌పాల్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు మోనికా! ‘ఏం ఆఫీసర్... బతకడానికేనా?’ అని హయ్యర్ సర్కిల్స్ నుంచి ఫోన్. ‘డ్యూటీనే నా బతుకు’ అన్నారు మోనికా. ‘నా డ్యూటీని నన్ను చెయ్యనివ్వండి’ అనీ అన్నారు. అంతకు ముందు మార్చిలో ఇంకో ఘటన జరిగింది. మోనికా అక్రమ సారా వ్యాపారులను అడ్డుకున్నారు. వాళ్ల తరఫున బీజేపీ నాయకుడొకరు ఆమెను బెదిరించాడు. చూసీ చూడనట్టు పొమ్మన్నాడు. ‘చూశాక, ఇక పోయేది లేదు’ అని అతడిపై కేసు పెట్టి, అరెస్ట్ చేశారు మోనికా. 3 రూపా మౌద్గిల్ కర్నాటక డి.ఐ.జి. (ప్రిజన్స్) 17 జూలై 2017 శశికళ పవర్ఫుల్. ఆమె చుట్టూ ఉన్న వాళ్లు పవర్ ఫుల్. జైలు నిబంధనలకు విరుద్ధంగా శశికళ సకల సౌకర్యాలూ అనుభవిస్తున్నారనీ, తన పై అధికారులే భారీ మొత్తంలో లంచాలు తీసుకుని ఆమెకు సహకరిస్తున్నారని రూప ధైర్యంగా బయటపెట్టారు. రూప ఆరోపణలపై విచారణ మొదలైంది. అది పూర్తయ్యేలోపే రూప, ఆమె సీనియర్ డి.జి. సత్యనారాయణరావు అక్కడి నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ‘నేనెక్కడైనా ఇంతే’ అని రూప ధైర్యంగా ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చి వెళ్లారు. 4 ఉషా సోమ్‌వంశీ సబ్ ఇన్స్పెక్టర్ జూలై 2017 జబల్పూర్ (మధ్యప్రదేశ్)లోని దుమ్నా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉషా సోమ్‌వంశీ. అద్దాలకు టింటెడ్ ఫిల్మ్ అంటించుకుని వెళుతున్న ఓ కారును అడ్డుకున్నారు. కారులో ఉన్నవారికి పెనాల్టీ రాశారు. కారులో ఉన్నవారు పలుకుబడి ఉన్నవారి పిల్లలు. ‘మాతో పెట్టుకోకు ఆఫీసర్’ అని చెప్పారు. ‘పెట్టుకోడానికే నేనుంది’ అని ఆమె కారు కీస్ తీసుకున్నారు. ఇదంతా వైరల్ అయింది. ఆ వెంటనే ఆమె ట్రాన్స్ఫర్ అయింది. 5 చారూ నిగమ్ ఐ.పి.ఎస్., గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ మే 2017 చారూ నిగమ్ ఝాన్సీలో పని చేసేటప్పుడు ఇల్లీగల్ లిక్కర్ మాఫియాను పరుగులు తీయిస్తుంటే పనిష్మెంట్గా గోరఖ్‌పూర్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. మే నెలలో ఇక్కడా ఆమె తన తఢాకా చూపించారు. రోడ్డు మీద నిరసన చేస్తూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్న వారిని ఆమె పక్కకు తోసేశారు. ‘మా నాయకుడు వస్తున్నాడు’ అని చెప్పినా ఆమె వినలేదు. ఆ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్ అగర్వాల్. వచ్చీ రాగానే చారూపై విరుచుకు పడ్డాడు. ‘లిమిట్స్ దాటకు’ అని హెచ్చరించాడు. అతడి మోటు భాషకు చారూ ఖిన్నురాలయ్యారు. వెంటనే సర్దుకున్నారు. రాబోయిన కన్నీటిని ఆపుకున్నారు. ‘ఆ నీటి తెర డ్యూటీలో నేను బలహీనమైనందుకు కమ్మినది కాదు, స్త్రీగా నా ఉద్వేగానికి ఒక సంకేతం’ అని ఆమె ధైర్యంగా చెప్పుకున్నారు. చారూ రూర్కీ ఐఐటిలో బీటెక్ చేశాక మనసు మార్చుకుని మరీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. 6 సంగీతా కాలియా ఐ.పి.ఎస్., ఫతెహాబాద్ ఎస్.పి. నవంబర్ 2015 హర్యానా హెల్త్ మినిస్టర్ అనిల్ విజ్‌తో పడింది సంగీతకు. జిల్లా ఫిర్యాదులు, పౌర సంబంధాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో అనిల్ విజ్ ఉన్నాడు. అక్కడే ఎస్.పి. సంగీత ఉన్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యను సంగీత ఆ హెల్త్ మినిస్టర్ దృష్టికి తెచ్చింది. ఆయనకు కోపం వచ్చింది. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అన్నాడు. ‘మీరు పొమ్మంటే పోడానికి నేనిక్కడి రాలేదు. నా జాబ్ నేను చేయడానికి వచ్చాను’ అని అక్కడే హఠం వేసుకుని కూర్చున్నారు సంగీత. మినిస్టర్ మనసులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆమెను ట్రాన్స్ఫర్ చేయించాడు. 7 దమయంతీ సేన్, ఐ.జి. అడ్మినిస్ట్రేషన్, పశ్చిమబెంగాల్ ఏప్రిల్ 2012 2012 తర్వాత దమయంతీ సేన్ కామ్ అయిపోయారని కాదు. ఆ ఏడాది ఆమె చూపిన తెగువ ఆమె కెరీర్లోనే ముఖ్యమైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘పార్క్ స్ట్రీట్ రేప్’ కేసులో దమయంతి ఇచ్చిన నివేదిక, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. తన ప్రతిష్టను దెబ్బతియ్యడానికి ఈ రేప్ కేసును వాడుకున్నారని మమత అనడం, ‘కేసును పరిశీలిస్తే అలాంటిదేమీ లేదు’ అని దమయంతి నివేదిక ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చ అయింది. ‘ఇంత రచ్చ చేశావ్ ఏంటి తల్లీ’ అని డిపార్ట్మెంట్ తలకొట్టుకుంటే.. దమయంతి మాత్రం ‘ఉన్న విషయమే చెప్పాను’ అని సింపుల్‌గా అన్నారు. అప్పుడు దమయంతీ సేన్ జాయింట్ కమిషనర్. ఆ పోస్టు నుండి ఆమెను అంతకన్నా తక్కువ ప్రాముఖ్యం ఉన్న డి.ఐ.సి. ట్రైనింగ్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. తిరిగి 2014లో ప్రభుత్వం ఆమెకు ఇలాంటి కీలకమైన కేసునే అప్పగించింది. 8 ఈషా పంత్, ఐ.పి.ఎస్. ఆఫీసర్ ప్రియాంక చోప్రా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘జై గంగాజల్’ చిత్రం ఈషా డైనమిజం ఆధారంగా తయారైందే. అప్పట్లో ఆమె భూపాల్ ఆఫీసర్. ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తున్నారు. 9 మెరిన్ జోసెఫ్ కేరళ ఐ.పి.ఎస్. ఆఫీసర్ ‘అందాల రాశులైన మన ఐ.పి.ఎస్. ఆఫీసర్లు’ అంటూ ఒక వార్తా పత్రిక ఓ పెద్ద జాబితా ఇవ్వడాన్ని మెరిన్ తీవ్రంగా నిరసించారు. ట్విట్టర్లో ఆ పత్రికపై విరుచుకు పడ్డారు. 10 కిమ్ శర్మ, బిహార్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ ఒరిజినల్ లేడీ సింగం అని పేరు. ఆమె అభిమానులు ఆమె పేరుతో ‘హెరాస్మెంట్’ అనే ఒక ఫేస్బుక్ అకౌంట్‌నే సృష్టించారు. ఫస్ట్ ఉమన్: కిరణ్ బేడీ ఇండియాలో తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి. బేడీని ‘క్రేన్ బేడీ’ అనేవారు. ఢిల్లీలో రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఆమె భారీ క్రేన్లతో ఎప్పటికప్పుడు ఎత్తేయించేవారు. అందుకు ఆ పేరు వచ్చింది. తీహార్ జైల్లో తొలిసారి సంస్కరణలను ప్రవేశపెట్టింది కూడా బేడీనే. 2015 ఢిల్లీ ఎన్నికలకు ముందు బేడీ బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్నారు. కంచన్ చౌదరి భట్టాచార్య దేశంలో డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌కి చేరుకున్న తొలి మహిళా పోలీస్ ఆఫీసర్ కంచన్. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 1980ల నాటి టెలీ సీరియన్ ‘ఉడాన్’కు ఆమె జీవితమే ఇన్స్పిరేషన్. కిరణ్ బేడీ తర్వాత రెండో మహిళా ఐ.పి.ఎస్. కంచన్. -
మహిళా ఫోర్స్.. మరీ వీక్!
8,734 మందికి ఒకే ఒక మహిళా పోలీస్ ఇదీ రాజధానిలో మహిళా పోలీసుల దుస్థితి గ్రేటర్లో మహిళా జనాభా 48.32 లక్షలు మహిళా పోలీసులు మాత్రం 519 బీపీఆర్ అండ్ డీ నివేదికలో వెల్లడి 1/8734..ఇదేదో మార్కుల లెక్క అనుకుంటే పొరపాటే. నగరంలో మహిళా పోలీసుల లెక్క. అవును.. ఇది నిజం. రాష్ట్ర రాజధానిలో మహిళా ఫోర్స్.. ఎంత వీక్‌గా ఉందో స్పష్టం చేసే లెక్క. ఇదేం ఆషామాషీగా చెబుతున్న లెక్క కాదు... కేంద్ర అధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్–డీ) తేల్చిన లెక్క. – సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ జనాభాలో మహిళలు 48 శాతం. జనాభాలో దాదాపు సగం మహిళలు ఉన్నప్పటికీ.. మహిళా పోలీసులు మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టే విధంగా ఉన్నారు. నగరంలోని రెండు కమిషనరేట్ల పరిధిలో కేవలం 519 మంది మహిళా పోలీసులే ఉన్నారు. అంటే ప్రతి 8,734 మంది మహిళలకు ఒకే ఒక్క మహిళా పోలీస్ అందుబాటులో ఉన్నారు. 2015 సంవత్సరానికి సంబంధించి బీపీఆర్ అండ్ డీ విడుదల చేసిన పోలీస్ సిబ్బంది గణాంకాల నివేదికలో మహానగరంలో మహిళా పోలీస్.. మరీ 2011 జనాభా ప్రాతిపదికన... బీపీఆర్ అండ్ డీ ప్రతి ఏటా అన్ని రాష్ట్రాలు, కమిషనరేట్లలోని పోలీస్ సిబ్బంది వివరాలను సేకరిస్తుంది. ఆయా ప్రాంతాల్లోని జనాభాతో పురుష–మహిళా పోలీసులు, సివిల్–ఆర్మీ రిజర్వ్ బలగాల్లోని సిబ్బందిని గణించి నివేదిక రూపొందిస్తుంది. తాజాగా విడుదల చేసిన నివేదికకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంది. ప్రస్తుతం రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. అయితే 2015 నాటికి కేవలం హైదరాబాద్, సైబరాబాద్ మాత్రమే ఉండటంతో.. ఆ రెండింటినే పరిగణిలోకి తీసుకున్నారు. మొత్తానికి నగరంలో సరిపడా మహిళా పోలీసులు లేరని ఈ నివేదిక స్పష్టం చేసింది. మహిళా పోస్టులు పెంచడంతో పాటు భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బీపీఆర్ అండ్ డీ రాష్ట్రాలను కోరింది. మహిళా పోలీసులు 3.8 శాతమే... రెండు కమిషనరేట్లలో కలిపి క్షేత్రస్థాయిలో సివిల్ సిబ్బంది 13,623 మంది ఉండగా, వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది కేవలం 519 మందే ఉన్నారని ఈ నివేదికలో తేలింది. వీరిలోనూ మూడో వంతు కానిస్టేబుల్ కంటే పైస్థాయి వారే. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని సిబ్బందిలో కేవలం 3.8 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారని బీపీఆర్ అండ్ డీ పేర్కొంది. మహిళా ఉద్యమకారుల్ని అదుపు చేయడం అత్యంత సున్నితమైన అంశం కావడంతో పాటు మహిళా పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడం, ఉన్నవారిలోనూ ఫిట్నెస్ లోపాలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్హెచ్ఓగా ఒక్కరూ లేరు.. జంట కమిషరేట్లలో 100కు పైగా లాఅండ్ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, ఐదు మహిళా ఠాణాలున్నాయి. ప్రస్తుతం మహిళా ఠాణాలకు ఉమెన్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నారు. అయితే శాంతి భద్రతల విభాగంలోని ఏ ఒక్క స్టేషన్‌కు కూడా మహిళా అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)గా లేరు. అనివార్య కారణాలతో కొన్నేళ్లుగా మహిళా పోలీసుల పోస్టులను పెంచకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. గతంలో ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థినుల నుంచి సరైన స్పందన ఉండేది కాదు. తాజాగా చేపట్టిన రిక్రూట్మెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు అనేక వెసులుబాట్లు కల్పించారు. దీంతో పోలీస్ విభాగంలో మహిళల కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు. సమస్యలతో సతమతం... మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో.. ప్రస్తుతం జంట కమిషనరేట్లలో ఉమెన్ హోంగార్డులతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిది పూర్తిస్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉన్న పోస్టు కాకపోవడం.. శిక్షణ భిన్నంగా ఉండడంతో భద్రత సహా కీలక, కార్యనిర్వాహక అంశాల్లో వీరిని వినియోగించుకోవడం సాధ్యం కావట్లేదు. ప్రస్తుతమున్న మహిళా సిబ్బందిని ఫిట్నెస్ సమస్య వెంటాడుతోంది. స్థూలకాయం, ఏళ్లుగా కార్యాలయ విధులకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయి విధులు, ఆందోళనకారుల అదుపు వీరికి సాధ్యం కానివిగా మారాయి. మహిళా పోలీస్ సిబ్బంది కొరత తీర్చడంతో పాటు ఉన్న వారిలోనూ నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మహిళా పోలీసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడం, వృత్తిలో మెలకువలు నేర్పే ఉద్దేశంతో ‘క్రాష్‌కోర్స్’ నిర్వహించాని భావించారు. బృందాల వారీగా కొందరికి పూర్తయినా తర్వాత ఆగిపోయింది. ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటుకు సన్నాహాలు చేసినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. -
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ నయ వంచన
నమ్మించి మహిళను లొంగదీసుకుని దగా డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు కదిరి టౌన్:చట్టాన్ని రక్షిస్తూ.. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుని.. ఆపై వంచించాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కదిరి పట్టణ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. శనివారం బాధితురాలు మీడియాకు ఈ వివరాలు వెల్లడించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మేరీ(38) కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. మదనపల్లిలోనే ఆమె ఆదర్శ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. అప్పట్లో తన సంస్థ కార్యక్రమాలకు కదిరి ఎమ్మెల్యే షాజహాన్‌ను ఆహ్వానిస్తుండేది. అప్పట్లో ఆయన వద్ద గన్‌మెన్‌గా ఉన్న వివాహితుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు(పీసీ-141) మేరీతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యేతో చెప్పి చేయిస్తానంటూ ఆశ చూపాడు. అనంతరం నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు. ఏడాది క్రితం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో.. తనకు తిండితో ఇబ్బందిగా ఉందని, కదిరికి వచ్చి తనతో పాటు ఉండాలని మేరీని కోరాడు. కానీ తన సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, తర్వాత కొందరితో చెప్పించడంతో ఒప్పుకుంది. దీంతో మే 23న కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసి సదరు కానిస్టేబుల్ సోదరుడు వెంకటస్వామి, అతని ఇరువురు కుమారులు ఇటీవల మేరీ ఇంట్లోకి చొరబడి నానా దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం చేశారు. ఆంజనేయులు సైతం తనను కులం పేరుతో దూషిస్తూ.. ఇకపై నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు.. జరిగిన విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి, వస్తువులు చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు డీఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని, నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కానిస్టేబుల్ ఆంజనేయులుపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ దేవదానం, పట్టణ ఎస్ఐ-2 రహిమాన్ తెలిపారు.