'షిం'హాలు | Some women's police adventures and Challenges | Sakshi
Sakshi News home page

'షిం'హాలు

Published Fri, Aug 4 2017 11:26 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

'షిం'హాలు

'షిం'హాలు

రఫ్‌ అండ్‌ టఫ్‌ జాబ్‌.. పోలీసుద్యోగం!
క్రిమినల్స్‌ని డీల్‌ చెయ్యాలి. పాలిటిక్స్‌ని డీల్‌ చెయ్యాలి.
పబ్లిక్‌లో ప్రతివాడికీ ఓ ‘పెద్దమనిషి’ ఉంటాడు.
ఆ పెద్దమనిషినీ డీల్‌ చెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే..
ఎంత డేరింగ్‌గా ఉండాలి? ఎంత డోన్ట్‌ కేరింగ్‌గా ఉండాలి.
సినిమాల్లో అయితే మహేష్‌ బాబు ‘పోలీస్‌’ అనగానే
అంతా గప్‌చుప్‌ అయిపోతారు.  
‘నేనేరా పోలీస్‌.. ఆ..’ అని సాయికుమార్‌ అనగానే..
అంతా సెట్‌రైట్‌ అయిపోతారు.
రియల్‌ లైఫ్‌లో అలా నడవదు.
నిజంగా అలా ఉండదా?
ఉంటుంది.. ఇదిగో ఇలాంటి


'షిం'హాలు ఉంటే..పవరున్నవాడైనా, పొగరున్నవాడైనా దారికి రావాల్సిందే. ఇటీవలి కాలంలో అలా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే పేరు తెచ్చిన కొందరు మహిళా పోలీస్‌ల సాహసాలు.. స్వాభిమానాల సంఘటనలు, ప్రతిఘటనలు ఇవి.

1 శేష్ఠ ఠాకూర్‌
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌  ,శ్యానా సర్కిల్‌ ఆఫీసర్‌ (బులంద్‌షహర్‌) 2017 జూన్‌
హెల్మెట్‌ లేకుండా బండి నడుపుతున్న వాళ్ల మీద యాక్షన్‌ తీసుకుంటున్నారు శ్రేష్ఠ. ‘పోనివ్వమ్మా.. పోలీసమ్మా’ అన్నారు బీజేపీ వాళ్లు సీన్‌లోకి వచ్చి. ‘మీరెవరు?’ అన్నారు శ్రేష్ఠ. ‘స్టేట్‌లో పవర్‌ మాదే’ అన్నారు వాళ్లు. ‘పవర్‌లో ఉన్నవాళ్లయితే పర్‌ఫెక్ట్‌గా ఉండాలి కదా’ అన్నారు శ్రేష్ఠ. బీజేపీ లీడర్స్‌కి, శ్రేష్ఠకీ గొడవైంది. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. జూలైలో శ్రేష్ఠకు ట్రాన్స్‌ఫర్‌ అయింది! బులంద్‌షహర్‌ నుంచి ఆమెను బారైచ్‌ పంపించారు. శ్రేష్ఠపై బీజేపీ నాయకులు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు కంప్లైంట్‌ చెయ్యగానే ఆయన వెంటనే ఏమీ యాక్షన్‌ తీసుకోలేదు. స్టేట్‌లో 244 మంది పోలీసు అధికారులకు బదలీలు అయ్యాయి. సింపుల్‌గా ఆ లిస్టులో శ్రేష్ఠ పేరును చేర్చారు. శ్రేష్ఠ వర్కింగ్‌ ఏరియా అయితే మారింది కానీ, ఆమె వర్కింగ్‌ స్పిరిట్‌ మారలేదు. బారైచ్‌కు బదలీ చేశాక ఫేస్‌బుక్‌లో ఇలా రాసుకున్నారు శ్రేష్ఠ. ‘బారైచ్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. ఈ ప్రాంతం నేపాల్‌ బార్డర్‌లో ఉంటుంది. డోన్ట్‌ వర్రీ మై ఫ్రెండ్స్‌. నేను సంతోషంగా ఉన్నాను. నా పనికి ఇది గుర్తింపుగా భావిస్తున్నాను. మీ అందరికీ బారైచ్‌కు నా ఆహ్వానం’.

2 మోనికా సేన్‌
ప్రొబేషనరీ ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌ జూలై 12, 2017
రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ పాల్‌ సింగ్‌ను ఎవరో చంపేశారు. ఆ ఘటన హింసకు దారి తీసింది. షాపుల్ని, బస్సుల్సీ, ప్రత్యర్థి గ్యాంగ్‌ అనుచరుల ఇళ్లను ధ్వంస చేస్తున్నారు ఆనంద్‌పాల్‌ మనుషులు. శాంతిభద్రతల్ని అదుపు చెయ్యడం కోసం ఆనంద్‌పాల్‌ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు మోనికా! ‘ఏం ఆఫీసర్‌... బతకడానికేనా?’ అని హయ్యర్‌ సర్కిల్స్‌ నుంచి ఫోన్‌. ‘డ్యూటీనే నా బతుకు’ అన్నారు మోనికా. ‘నా డ్యూటీని నన్ను చెయ్యనివ్వండి’ అనీ అన్నారు. అంతకు ముందు మార్చిలో ఇంకో ఘటన జరిగింది. మోనికా అక్రమ సారా వ్యాపారులను అడ్డుకున్నారు. వాళ్ల తరఫున బీజేపీ నాయకుడొకరు ఆమెను బెదిరించాడు. చూసీ చూడనట్టు పొమ్మన్నాడు. ‘చూశాక, ఇక పోయేది లేదు’ అని అతడిపై కేసు పెట్టి, అరెస్ట్‌ చేశారు మోనికా.

3 రూపా మౌద్గిల్‌
కర్నాటక డి.ఐ.జి. (ప్రిజన్స్‌) 17 జూలై 2017
శశికళ పవర్‌ఫుల్‌. ఆమె చుట్టూ ఉన్న వాళ్లు పవర్‌ ఫుల్‌. జైలు నిబంధనలకు విరుద్ధంగా శశికళ సకల సౌకర్యాలూ అనుభవిస్తున్నారనీ, తన పై అధికారులే భారీ మొత్తంలో లంచాలు తీసుకుని ఆమెకు సహకరిస్తున్నారని రూప ధైర్యంగా బయటపెట్టారు. రూప ఆరోపణలపై విచారణ మొదలైంది. అది పూర్తయ్యేలోపే రూప, ఆమె సీనియర్‌ డి.జి. సత్యనారాయణరావు అక్కడి నుంచి ఇంకో చోటికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. ‘నేనెక్కడైనా ఇంతే’ అని రూప ధైర్యంగా ఓ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చి వెళ్లారు.

4 ఉషా సోమ్‌వంశీ
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జూలై 2017
జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌)లోని దుమ్నా పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉషా సోమ్‌వంశీ. అద్దాలకు టింటెడ్‌ ఫిల్మ్‌ అంటించుకుని వెళుతున్న ఓ కారును అడ్డుకున్నారు. కారులో ఉన్నవారికి పెనాల్టీ రాశారు. కారులో ఉన్నవారు పలుకుబడి ఉన్నవారి పిల్లలు. ‘మాతో పెట్టుకోకు ఆఫీసర్‌’ అని చెప్పారు. ‘పెట్టుకోడానికే నేనుంది’ అని ఆమె కారు కీస్‌ తీసుకున్నారు. ఇదంతా వైరల్‌ అయింది. ఆ వెంటనే ఆమె ట్రాన్స్‌ఫర్‌ అయింది.

5 చారూ నిగమ్‌
ఐ.పి.ఎస్‌., గోరఖ్‌పూర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ మే 2017
చారూ నిగమ్‌ ఝాన్సీలో పని చేసేటప్పుడు ఇల్లీగల్‌ లిక్కర్‌ మాఫియాను పరుగులు తీయిస్తుంటే పనిష్మెంట్‌గా గోరఖ్‌పూర్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. మే నెలలో ఇక్కడా ఆమె తన తఢాకా చూపించారు. రోడ్డు మీద నిరసన చేస్తూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్న వారిని ఆమె పక్కకు తోసేశారు. ‘మా నాయకుడు వస్తున్నాడు’ అని చెప్పినా ఆమె వినలేదు. ఆ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్‌ అగర్వాల్‌. వచ్చీ రాగానే చారూపై విరుచుకు పడ్డాడు. ‘లిమిట్స్‌ దాటకు’ అని హెచ్చరించాడు. అతడి మోటు భాషకు చారూ ఖిన్నురాలయ్యారు. వెంటనే సర్దుకున్నారు. రాబోయిన కన్నీటిని ఆపుకున్నారు. ‘ఆ నీటి తెర డ్యూటీలో నేను బలహీనమైనందుకు కమ్మినది కాదు, స్త్రీగా నా ఉద్వేగానికి ఒక సంకేతం’ అని ఆమె ధైర్యంగా చెప్పుకున్నారు.
చారూ రూర్కీ ఐఐటిలో బీటెక్‌ చేశాక మనసు మార్చుకుని మరీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు.

6 సంగీతా కాలియా
ఐ.పి.ఎస్‌., ఫతెహాబాద్‌ ఎస్‌.పి. నవంబర్‌ 2015
హర్యానా హెల్త్‌ మినిస్టర్‌ అనిల్‌ విజ్‌తో పడింది సంగీతకు. జిల్లా ఫిర్యాదులు, పౌర సంబంధాల కమిటీ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో అనిల్‌ విజ్‌ ఉన్నాడు. అక్కడే ఎస్‌.పి. సంగీత ఉన్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యను సంగీత ఆ హెల్త్‌ మినిస్టర్‌ దృష్టికి తెచ్చింది. ఆయనకు కోపం వచ్చింది. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అన్నాడు. ‘మీరు పొమ్మంటే పోడానికి నేనిక్కడి రాలేదు. నా జాబ్‌ నేను చేయడానికి వచ్చాను’ అని అక్కడే హఠం వేసుకుని కూర్చున్నారు సంగీత. మినిస్టర్‌ మనసులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు.

7 దమయంతీ సేన్, ఐ.జి.
అడ్మినిస్ట్రేషన్, పశ్చిమబెంగాల్‌ ఏప్రిల్‌ 2012
2012 తర్వాత దమయంతీ సేన్‌ కామ్‌ అయిపోయారని కాదు. ఆ ఏడాది ఆమె చూపిన తెగువ ఆమె కెరీర్‌లోనే ముఖ్యమైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘పార్క్‌ స్ట్రీట్‌ రేప్‌’ కేసులో దమయంతి ఇచ్చిన నివేదిక, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. తన ప్రతిష్టను దెబ్బతియ్యడానికి ఈ రేప్‌ కేసును వాడుకున్నారని మమత అనడం, ‘కేసును పరిశీలిస్తే అలాంటిదేమీ లేదు’ అని దమయంతి నివేదిక ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చ అయింది. ‘ఇంత రచ్చ చేశావ్‌ ఏంటి తల్లీ’ అని డిపార్ట్‌మెంట్‌ తలకొట్టుకుంటే.. దమయంతి మాత్రం ‘ఉన్న విషయమే చెప్పాను’ అని సింపుల్‌గా అన్నారు. అప్పుడు దమయంతీ సేన్‌ జాయింట్‌ కమిషనర్‌. ఆ పోస్టు నుండి ఆమెను అంతకన్నా తక్కువ ప్రాముఖ్యం ఉన్న డి.ఐ.సి. ట్రైనింగ్‌ విభాగానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. తిరిగి 2014లో ప్రభుత్వం ఆమెకు ఇలాంటి కీలకమైన కేసునే అప్పగించింది.


8 ఈషా పంత్, ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌
ప్రియాంక చోప్రా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన ‘జై గంగాజల్‌’ చిత్రం ఈషా డైనమిజం ఆధారంగా తయారైందే. అప్పట్లో ఆమె భూపాల్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తున్నారు.



9 మెరిన్‌ జోసెఫ్‌
కేరళ ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌
‘అందాల రాశులైన మన ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌లు’ అంటూ ఒక వార్తా పత్రిక ఓ పెద్ద జాబితా ఇవ్వడాన్ని మెరిన్‌ తీవ్రంగా నిరసించారు. ట్విట్టర్‌లో ఆ పత్రికపై విరుచుకు పడ్డారు.

10 కిమ్‌ శర్మ, బిహార్‌ ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌
ఒరిజినల్‌ లేడీ సింగం అని పేరు. ఆమె అభిమానులు ఆమె పేరుతో ‘హెరాస్‌మెంట్‌’ అనే ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌నే సృష్టించారు.

ఫస్ట్‌ ఉమన్‌: కిరణ్‌ బేడీ
ఇండియాలో తొలి మహిళా ఐ.పి.ఎస్‌. అధికారి. బేడీని ‘క్రేన్‌ బేడీ’ అనేవారు. ఢిల్లీలో రాంగ్‌ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఆమె భారీ క్రేన్‌లతో ఎప్పటికప్పుడు ఎత్తేయించేవారు. అందుకు ఆ పేరు వచ్చింది. తీహార్‌ జైల్‌లో తొలిసారి సంస్కరణలను ప్రవేశపెట్టింది కూడా బేడీనే. 2015 ఢిల్లీ ఎన్నికలకు ముందు బేడీ బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్నారు.

కంచన్‌ చౌదరి భట్టాచార్య
దేశంలో డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌కి చేరుకున్న తొలి మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ కంచన్‌. 2014లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. 1980ల నాటి టెలీ సీరియన్‌ ‘ఉడాన్‌’కు ఆమె జీవితమే ఇన్‌స్పిరేషన్‌. కిరణ్‌ బేడీ తర్వాత రెండో మహిళా ఐ.పి.ఎస్‌. కంచన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement