
కేంద్రంతో ఆప్ కయ్యం..!
- ఢిల్లీ అవినీతి నిరోధక చీఫ్‌గా చతుర్వేది!
- నిర్ణయం తీసుకోనున్న ఆప్ సర్కారు
- ఎయిమ్స్ సీవీఓ పదవి నుంచి చతుర్వేదికి
- గతంలో ఉద్వాసన పలికిన మోదీ సర్కారు
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చి 24 గంటలైనా కాకుండానే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు ఎన్డీయే ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వింది. ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా పనిచేసిన సంజీవ్ చతుర్వేదిని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ చీఫ్‌గా తీసుకురావాలనుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.
సంజీవ్ చతుర్వేదిని అతని నియామక తీరుపై వచ్చిన అభ్యంతరాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగం నుంచి అర్ధంతరంగా తొలగించింది. చతుర్వేది నియామక తీరు సరైంది కాదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీఓపీటీ)కి ప్రస్తుత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాయటంతో, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చతుర్వేదిని తప్పించారు. ఆ సందర్భంలో చతుర్వేదిని ఆప్ పూర్తిగా సమర్థించింది. ఇప్పుడు ఆయనను ఏసీబీ చీఫ్‌గా నియమిస్తే ఆ విభాగం వంద రెట్లు బలపడుతుందని సిసోడియా అన్నారు. ఈ దిశగా ఆప్ సర్కారు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఆప్‌ను గెలిపించింది ఆర్‌ఎస్‌ఎస్సే
బీజేపీ నినాదమైన ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’లో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపునకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆరెస్సెస్ దీర్ఘకాలిక ప్రణాళికలో కేజ్రీవాల్ కూడా భాగస్వామేనని ఆయన గురువారం అన్నారు. అన్నాహజారే ఉద్యమం వెనుక సంఘ్ పాత్ర ఉందని గతంలో దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘అన్నా ఉద్యమం వెనుక సంఘ్ ఉందని నేనన్నప్పుడు అంతా నన్ను పిచ్చివాడన్నారు. చివరకు నేనన్నదే నిజమైంది. ఇప్పుడు కూడా నేను చెప్పిందే నిజం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇలాంటి హామీలు ఎవరైనా ఇస్తారా?
ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు సరఫరాపై నూటికి నూరు శాతం ఆధారపడే ఢిల్లీలో విద్యుత్తు బిల్లులను తగ్గిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇవ్వటంపై ప్రధాని నరేంద్రమోదీ విస్మయం వ్యక్తం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల సదస్సులో ఆదివారం మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్తు వంటి హామీలు ఇస్తున్నాయని, ఇలాంటి హామీల గురించి ప్రజలు ఒకసారి ఆలోచించాలని ఆయన అన్నారు.
ఢిల్లీలో ఆప్ హామీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రైతులకు నీటి బిల్లులు పెరిగి పోవటానికి ప్రధాన కారణం విద్యుత్ భారమేనని.. రైతుల సమస్యలకు కారణం ఏమిటన్నది రాజకీయ నేతలు వాస్తవంగా ఆలోచించాలని.. పైగా విద్యుత్ కోసం పూర్తిగా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే చోట ఇలాంటి హామీలు ఇబ్బందికరంగా మారతాయని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఆప్ వెంటనే స్పందించింది. తాము ప్రధాని మాటలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడబోమని, ఢిల్లీకి కొరత లేకుండా విద్యుత్ సరఫరా చేయటంలో మోదీ సహకరించాలని ఆప్ నేత అశుతోష్ కోరారు.