కొత్త డిజైన్లను అన్వేషించాలి: కావూరి
Published Wed, Oct 16 2013 12:56 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల రంగంలో అంతర్జాతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే కొత్త డిజైన్ల అన్వేషణ అవసరమని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. నవ్యత, నాణ్యత, సృజనాత్మకత అంశాలను దృష్టిలో ఉంచుకొని తయారుచేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ ఆదరణ ఉంటుందన్నారు. దీనివల్ల శ్రమకు తగిన ఫలితం ఉత్పత్తిదారులకు, పెట్టుబడికి తగిన ఆదాయం ఎగుమతిదారులకు, మంచి వస్తువులు వినియోగదారులకు లభ్యమవుతాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి కంపెనీల అవసరాలు, డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని రంగులు, డిజైన్లు, ప్యాటర్న్‌లు తయారు చేయకుంటే మనుగడ అసాధ్యమన్నారు.
నోయిడాలోని ఎక్స్‌పోలో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఇండియా హ్యాండిక్రాప్ట్స్, గిఫ్ట్స్ మేళా (అటమున్)-2013ని కేంద్ర మంత్రి కావూరి మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ మేళాను ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హాండిక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) నిర్వహిస్తోంది. హస్తకళల రంగం అభివృద్ధికి కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని, నిధుల అవసరాలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. హస్తకళల డిజైన్ల రూపకల్పన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వస్తువులు తయారుచేసేవారిలో వృత్తినైపుణ్యం పెంచడానికి అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్న ఈపీసీహెచ్ సేవలను కొనియాడారు.
అనంతరం మంత్రి కావూరి మేళా డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూపీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అభిషేక్ మిశ్రా మాట్లాడుతూ హ్యాండిక్రాఫ్ట్స్ మేళా నిర్వహించడానికి వచ్చిన వారికి యూపీ సర్కారు స్వాగతిస్తోందన్నారు. హస్తకళలలో మొత్తం ఎగుమతుల్లో 40 శాతం యూపీలోని మోరాదాబాద్, భదోయి, లక్నో తదితర ప్రాంతాల నుంచి ఉండడం అభినందనీయమన్నారు.
Advertisement
Advertisement