టవర్లపై కోర్టు తీర్పుతో కలవరం
Published Sat, Apr 12 2014 10:18 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: తమకూ సొంత గూడు ఉండాలని కలలుగన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఏం చేయాలో తోచని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది నోయాడా ఎక్స్‌టెన్షన్‌లోని అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి.నోయిడా సెక్టార్ 93ఏలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు ప్రాజెక్టులో నిర్మించిన రెండు 40 అంతస్తుల టవర్ల కూల్చివేతకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని ఫ్లాట్ కోనుగోలుదారులు వేల మంది ఆందోళన చెందుతున్నారు. నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో నిర్మిస్తున్న అనేక భవనాల బిల్డర్లకు కూడా ఇటువంటి ఉత్తర్వులు జారీ కావచ్చన్న భయం వారిని వేధిస్తోంది. అలాంటి ఉత్తర్వులే జారీ అయితే నష్టపోయేది తామేనని ఫ్లాట్ కొనుగోలుదారులు వాపోతున్నారు.
సూపర్‌టెక్ మాదిరిగానే నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని ఇతర బిల్డర్లు కూడా అనుమతులను మించి అదనపు టవర్లను నిర్మించారు. ఇప్పుడు సూపర్‌టెక్‌పె కన్నెర్రజేసిన న్యాయస్థానం రేపు తమ భవనాల బిల్డర్లపైనా న్యాయస్థానం కొరడా ఝుళిపించవచ్చని ఫ్లాట్ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా అథారిటీల అధికారులతో బిల్డర్లు కుమ్మక్కై ఈ అదనపు నిర్మాణాలు జరుపుతున్నారని ఈ అక్రమాల వల్ల నష్టపోయేది తామేనని ఫ్లాట్ కొనుగోలు దారులు అంటున్నారు. ఫ్లాట్ ధరలో 85 - 90 శాతం వరకు ఇప్పటికే బిల్డర్లకు చెల్లించామని, కోర్టు ఉత్తర్వులు గనక జారీ చేస్తే నష్టపోతామని అంటున్నారు. అదనపు టవర్ల నిర్మాణం చేపట్టి తమకు ఫ్లాట్లు ఇవ్వడంలో బిల్డర్లు ఓవైపు జాప్యం చేస్తున్నారని, కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే దానిని సవాలుచేస్తూ పైకోర్టుకు వెళ్లతారని ఇది మరింత ఆలస్యానికి దారితీస్తుందని వారు అంటున్నారు.
మరోవైపు 40 అంతస్తుల టవర్లను కూల్చివేయాలన్న ఆదేశాలతో భవనాలను అమ్మిన ప్రమోటర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం మొత్తం పూర్తయ్యిందని, ఇప్పటికే 90 శాతం ఫ్లాట్లు కూడా అమ్ముడుపోయాయని, కోర్టు ఆదేశాలు అమలయితే ఫ్లాట్లను బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు తాము 860 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు ప్రమోటర్లు. వినియోగదారులకు డబ్బు తిరిగి ఇచ్చేసినా అపార్ట్‌మెంట్స్‌కు డబ్బు పెట్టుబడి పెట్టినవారి పరిస్థితి ఏమిట ని వారు ప్రశ్నిస్తున్నారు. రియల్‌ఎస్టేట్ అంచనాల ప్రకారం నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే వెంట ఉన్న ఆస్తుల విలువ 2014 కల్లా ఐదు శాతం పెరుగుతుందని భావించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం సూపర్‌టెక్ టవర్స్ విలువ 750 కోట్లు. కొనుగోలుదారులు డబ్బులు చెల్లించిన నాటినుంచి ఇప్పటివరకూ 14శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వినియోగదారులు చెల్లించిన దానికంటే ఇటీవలి కాలంలో మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది... అలాంటి పరిస్థితుల్లో తాము ఎలా తిరిగి చెల్లించగలుగుతామంటున్నారు ప్రమోటర్స్.
సెక్టార్ 93ఏలో సూపర్‌టెక్ నిర్మిస్తోన్న రెండు 40 అంతస్తుల భవనాలను కూల్చివేయవలసిందిగా అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నోయిడా అథారిటీని ఆదేశించడం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను చేపట్టినందుకు సూపర్‌టెక్ సంస్థను, నియమాలను బుట్టదాఖలు చేసి, నిర్మాణాలకు అనుమతించిన నోయిడా అథారిటీ అధికారులపై కూడా చర్య తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ టవర్లలో పెట్టుబడి పెట్టినవారికి వారి సొమ్మును 14 శాతం వడ్డీతో చెల్లించాలి కూడా న్యాయస్థానం సూపర్‌టెక్‌ను ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సూపర్‌టెక్ నిర్ణయించింది. ఈ రెండు టవర్లలో 500 అపార్టుమెంట్లున్నాయి. సూపర్‌టెక్ గ్రూప్ తాజ్‌ఎక్స్‌ప్రెస్‌వేపై చేపట్టిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టులో భాగంగా రెండు 40 అంతస్తుల టవర్లను నిర్మించింది. సూపర్‌టెక్ చేపట్టిన ప్రాజెక్టులన్నిటిలోకెల్లా ఇది పెద్దది. 70 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 750 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టులో నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 15 టవర్లను నిర్మిస్తున్నారు.
Advertisement
Advertisement