
కోర్టుకు హాజరుకావాలి
చెన్నై : ఈ నెల 27 న కోర్టుకు హాజరు కావలసిందిగా ప్రముఖ హాస్యనటుడు వడివేలును నామక్కల్ కోర్టు ఆదేశించింది. వివరాల్లోకెళితే.. గత నెల 18న దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విశాల్ వర్గానికి మద్దతు తెలిపిన హాస్యనటుడు వడివేలు ఒక సమావేశంలో అసలు ఇప్పుడు దక్షిణ భారత నటీనటుల సంఘం ఉందా అంటూ సంఘాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ నామక్కల్ జిల్లా రంగస్థల సంఘం అధ్యక్షుడు రాజా అక్టోబర్ 27వ తారీఖున నామక్కల్ జిల్లా నేర విభాగ కోర్టులో ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి నటుడు వడివేలు ఈ నెల 20వ తారీఖున కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే శుక్రవారం వడివేలు కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరపు న్యాయవాది హాజరయ్యి వర్షాల కారణంగా వడివేలు కోర్టుకు హాజరుకాలేక పోయారని వివరించారు. దీంతో ఈ నెల 27న వడివేలు కోర్టుకు హాజరుకావలసిందిగా నామక్కల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.