
కుమార్తె స్నేహితురాలిపై అకృత్యం
చెన్నై: టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అతని కుమార్తె క్లాస్‌మేట్ కావటం, ఇందుకు అతని భార్య తోడ్పాటు అందించటం గమనార్హం. అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రాగా పిల్లలతోపాటు భార్య, భర్త పరారయ్యారు. చెన్నైలోని తూత్తుకుడిలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రాంతానికి చెందిన తవసిపెరుమాల్(45), చిత్ర దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి ఇంటికి సమీపంలోనే ఉండే బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. ఈమె తవసి పెరుమాల్ కుమార్తెకు దగ్గరి స్నేహితురాలు. ఈ బాలిక బుధవారం రాత్రి టీవీ చూసేందుకు వెళ్లింది. తవసిపెరుమాల్ కుమార్తెలు ఆడుకుంటూ బయటకు వెళ‍్లగా చిత్ర వంటింట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన తవసిపెరుమాల్ బాలికను అరవకుండా నోరుమూసి, కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేశాడు. ఎవరికీ ఈ విషయం చెప్పవద్దని బెదిరించాడు. అదే సమయంలో లోపలికి వచ్చిన చిత్రకు బాధితురాలు ఏడ్చుకుంటూ విషయం చెప్పింది. అది విన్న చిత్ర.. భర్తకు మద్దతుగా మాట్లాడింది. ఇక్కడ జరిగిన సంఘటనను బయట ఎవరికీ చెప్పవద్దని బెదిరించి ఆమెను పంపించి వేసింది.
ఇంటికి వెళ్లిన బాలిక వ్యాకులతతో ఉండటంతో ఆమె తల్లి ఆరా తీసింది. దీంతో ఆమె అసలు విషయం తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి తూత్తుకుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తూత్తుకుడిలో ఉన్న మహిళ పోలీసులు కేసు నమోదు చేసి తవసిపెరుమాల్, చిత్ర కోసం వెళ్లగా గమనించిన నిందితులు తమ పిల్లలతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.