
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
దసరా పండుగను పురస్కరించుకుని నగ రంలోని గురుశాంతప్ప లేఔట్‌లోగల సీతారామ ఆశ్రమంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు నేతి సీతారామయ్య శర్మ పేర్కొన్నారు.
బళ్లారి అర్బన్ : దసరా పండుగను పురస్కరించుకుని నగ రంలోని గురుశాంతప్ప లేఔట్‌లోగల సీతారామ ఆశ్రమంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు నేతి సీతారామయ్య శర్మ పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 25న బాలదేవి, 26న త్రిపురసుందరి దేవి, 27న లలితాదేవి, 28న అన్నపూర్ణాదేవి, 29న గాయత్రీదేవి, 30న చండికాదేవి, 1న మహాసరస్వతి, మహాలక్ష్మి, 2న మహాదుర్గ మహాకాళి, దుర్గాష్టమి, మహర్నవమి, 3న రాజరాజేశ్వరిదేవి అవతారాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవార్లకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమాలు, ఉదయం గోపూజ, సాయంత్రం 6 గంటల నుంచి లక్ష వత్తుల దీపోత్సవం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మహాలక్ష్మి ఆలయంలో నేటినుంచి నవరాత్రి ఉత్సవాలు
బళ్లారి (తోరణగల్లు) : స్థానిక ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో గురువారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారిని అక్టోబర్ 3 వరకు వరుసగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, కొల్హాపురి మహాలక్ష్మి అవతారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శ్రీరామనగర్ : స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బుధవారం ప్రధాన అర్చకుడు కాశీ వెంకట సత్యనారాయణ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, స్వర్ణకవచ అలంకరణ, 7 గంటలకు ప్రార్థివ లింగార్చన, బిల్వ అర్చన, 8 గంటలకు కుంకుమార్చన ఉంటాయని తెలిపారు.
కాగా ఆంధ్ర నుంచి పదివేల మంది వేదపండితులతో చండీ హోమం జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తమ్మినీడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పీ.ధర్మారావు, సభ్యులు మన్నె కృష్ణమూర్తి, డీఆర్.ప్రసాద్, టీ.జయరామిరెడ్డి, చిలుకూరి బుజ్జి, ఏ చంటిరాజు తెలిపారు.