దసరా ఏనుగులకు ‘అగ్ని పరీక్ష’
మైసూరు : విశ్వ విఖ్యాత దసరా సంబరాల్లో జరిగే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల చేత చేయిస్తున్న రిహార్సల్స్‌లో భాగంగా శనివారం ఫిరంగి పేలుళ్లు నిర్వహించారు. రాజ ప్రాసాదం దక్షిణ ద్వారంలోని కోట మారమ్మ దేవస్థానంలో ఈ రిహార్సల్స్ జరిగాయి. దసరా ఉత్సవాల్లో జంబూ సవారీని నిర్వహించేటప్పుడు బన్ని మంటపం వద్ద 21 సార్లు ఫిరంగుల ద్వారా పేల్చుతారు. ఆ సందర్భంగా ఏనుగులు, గుర్రాలు బెదిరి పోకూడదనే ఉద్దేశంతో ముందుగానే శిక్షణనిస్తారు.
అందులో భాగంగా ఎనిమిది సార్లు ఫిరంగి పేలుళ్లు జరిపారు. అక్టోబరు మూడే తేదీ వరకు మూడు రోజులకోసారి ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు, పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది. రాజప్రాసాదం ఆవరణలో విడిది చేసిన అర్జున నాయకత్వంలోని తొలి బృందానికి ఇదంతా పరిచయమే కనుక ఇనుప గొలుసులతో వాటిని బంధించలేదు. రెండో బృందంలోని ఏనుగులను మాత్రం గొలుసులతో బంధించారు. ఈ బృందంలోని దుర్గా పరమేశ్వరి, గోపీ అనే ఏనుగులు మాత్రం పేలుడు శబ్దాలకు కొంత గాబరా పడ్డాయి.