
తండ్రి హత్య కేసులో ప్రేమికుడితోపాటు కుమార్తె లొంగుబాటు
కేకే.నగర్: తండ్రిని హత్య చేసిన కేసులో ప్రేమికుడు సహా కుమార్తె న్యాయస్థానంలో లొంగిపోయింది. ఈ సంఘటన కో యంబత్తూరులో చోటు చేసుకుంది. కోయంబత్తూరు చొక్కం పుదూర్ షణ్ముగానగర్‌కు చెందిన నాగరాజన్ (55) కెమికల్ బిజినెస్ చేసేవాడు. ఇతని భార్య ప్రమీల. కుమార్తె మహాలక్ష్మి. ఈమె కోయంబత్తూరు మలుమిచ్చింపట్టిలో గల ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.
మహాలక్ష్మి ఒత్తకాల్ మండపం ప్రీమియర్ మిల్ ఆర్సీ నగర్‌కు చెందిన సతీష్ (19)ను ప్రేమించింది. వీరి ప్రేమను ఆమె తండ్రి నాగరాజన్ అంగీకరించలేదు. కూతురుకు మద్దతు ఇచ్చిన ప్రమీల, మహాలక్ష్మిని నాగరాజన్ ఇంటి నుంచి తరిమేశాడు. ఈ కారణంగా నాగరాజన్ పై వారికి ద్వేషం ఏర్పడింది. ఆయన్ని హత్య చేయాలని మహాలక్ష్మి, ప్రమీల, సతీష్ కలిసి పథకం పన్నారు.
దాని ప్రకారం సతీష్, తన మిత్రులు నలుగురితో కలిసి నెక్కమమ్ తోటలో నాగరాజన్‌పై కత్తితో దాడి జరిపి హత్య చేశారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వెతుకుతున్న మహాలక్ష్మి, సతీష్ శుక్రవారం కోయంబత్తూర్ జేఎం 5 మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇద్దరికి రిమాండ్ విధించి... జూన్ 17వ తేదీన పొల్లాచ్చి జేఎం 2 మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరారీలో ఉన్న నాగరాజన్ భార్య ప్రమీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.