జంతర్‌మంతర్‌లో నేటికీ...
Published Sun, Dec 15 2013 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
సాక్షి, న్యూఢిల్లీ: ‘డిసెంబర్ 16’ రాత్రి ఘటన ఇంకా ఢిల్లీవాసుల మదిలో మెదులుతూనే ఉంది. ఆడబిడ్డపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ చిన్నా పెద్దా.. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరి పిడికిళ్లు బిగిశాయి. కన్నెర్ర చేసిన ఢిల్లీయువత ఆగ్రహానికి రైసినాహిల్స్ జనసంద్రంగా మారింది. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీ యావత్తు ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. అంతా ఒక్కటై నిర్భయకు న్యాయం చేయాలని నినదించారు. పోలీసు ఆంక్షలు వారిని ఆపినా.. బారికేడ్లు అడ్డుపెట్టినా జనసామాన్యం గొంతుకను వినిపించే జంతర్‌మంతర్ ఆందోళనలో తాను పాలుపంచుకుంది. ఆందోళనకారులను తన అక్కున చేర్చుకుని నినాదాలతో ఘోషించి ంది. 16 డిసెంబర్ క్రాంతి పేరిట ఏర్పడిన సంస్థ నిర్భయ నిందితులను తుదముట్టించేవరకు పోరు సాగిస్తాంటూ జంతర్‌మంతర్‌లో నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏడాది గడిచినా జంతర్‌మంతర్‌లో నిర్భయ ఘటన అనంతర ఉద్యమాల తాలూకా జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
నేటికి మారుమ్రోగుతున్న నినాదాలు:
కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన దాడి ఘటన తర్వాత జనాగ్రహం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తూ వచ్చింది. రోజురోజుకు ఆందోళనలో పాల్గొనే వారి సంఖ్య వందల నుంచి వేలల్లోకి మారిపోయింది. ‘వీ వాంట్ జస్టిస్...’ ‘ఫాంసీదో.. ఫాంసీదో..’అంటూ చేసిన నినాదాలు నేటికి ఆ ప్రాంతానికి వెళితే చెవుల్లో మారుమ్రోగినట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుపై పడుకునేందుకు ఉడికిపోయారు యువత. నిరసన వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకున్నారు. కొందరు ఆవేదనతో దిక్కులు పిక్కటిల్లేలా ‘న్యాయం చేయండి’అంటూ నినదిస్తే.. జావత్ జాతిని మేల్కొలిపిన ‘చెల్లెమ్మ’ ఆరోగ్యం కుదుటపడాలంటూ నిరంతరం ప్రార్థనలు చేశారు. కళాకారులు సైతం కుంచె కలిపారు. తమ బొమ్మలతో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చూపారు.
నిర్భయ సమాధిని ఏర్పాటుచేసి అక్కడ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జంతర్‌మంతర్‌లో చేసే ధర్నాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిర్భయ ఘటనలు ఒకటి. ఇక్కడ ఏళ్లుగా ఆందోళనలు చేసినా నెరవేరని ఎన్నో డిమాండ్లు ఉన్నా, నిర్భయ ఘటనలో యువత స్పందించిన తీరు.. జంతర్‌మంతర్‌లో కొనసాగిన నిరసనల హోరు పార్లమెంట్‌నూ కుదిపేసింది.ఘటన జరిగిన తర్వాత నుంచి నిర్భయ మతి ఆతర్వాతి పరిణామాల వరకు యావత్ దేశం చూపంతా జంతర్‌మంతర్‌పైనే కేంద్రీకతమై ఉంది. దేశ, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం చర్చకు దారితీసిన ఓ ‘ఘటన’కు జంతర్‌మంతర్ సజీవ సాక్ష్యం నిలిచింది. ఇక్కడ రోజుల తరబడి చేసిన ఆందోళనలే తర్వాతి కాలంలో ‘నిర్భయ చట్టం’రావడానికి కారణమాయ్యయనేది చరిత్ర మరువని సత్యం.
Advertisement
Advertisement