జీపీఎస్ లేని వాహనాలపై కొరడా
Published Sun, Dec 15 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన జరిగిన తర్వాత రవాణా విభాగంలో భారీ మార్పులే కనబడుతున్నాయి. ప్రయాణికుల భద్రతతో పాటు ఇతర నియమాలను పాటించని అన్ని వాహనాలపై దాడులు చేసేందుకు నియమించిన ప్రత్యేక బృందం అనుకున్న మేరకు ఫలితాలను రాబట్టగలుగుతోంది. ఈ ఏడాది నియమాలు పాటించని 202 చార్టెర్డ్ బస్సుల పర్మిట్‌ను రద్దు చేసింది. ఈ సంఖ్య స్వల్పంగా కనిపిస్తున్నా గతేడాదితో పొల్చుకుంటే ఇది మెరుగనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఒక్క బస్సు పర్మిట్‌ను కూడా రద్దు చేయని రవాణా శాఖ అధికారులు ఈసారి 2,529 చార్టెర్డ్ బస్సుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లను రద్దు చేయగా, మరికొన్నింటిని సస్పెండ్ చేశారు.
నిర్భయపై అత్యాచారం బస్సులో జరగడంతో దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో అప్రమత్తమైన రవాణా శాఖ ప్రజా రవాణా వాహనాలపై దృష్టి సారించింది. ప్రతి వాహనం సెప్టెంబర్‌లోపు జీపీఎస్ వ్యవస్థను అమర్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. లేకపోతే చలాన్‌లు విధిస్తామని, పర్మిట్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.నవంబర్ నెలాఖరువరకు నియమాలు పాటించని 2,500 బస్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ వరకు సమయమిచ్చినా జీపీఎస్ అమర్చుకోని 451 గ్రామీణ్ సేవా వాహనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2,138 వాహనాల పర్మిట్‌ను కూడా రద్దు చేసింది. అలాగే 2,464 ఆటో యజమానులపై కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంది.
నవంబర్ వరకు 3,05,549 చార్టెర్డ్ బస్సులు ఇప్పటికీ జీపీఎస్ అమర్చుకోలేదని తెలిపింది. 2011-12లో 1,549 ప్రయాణికుల వాహనాలు స్వాధీనం చేసుకున్న రవాణాశాఖ ఈసారి 10,144 వాహనాలను జప్తు చేసుకుంది. ఇప్పటివరకు 1.54 లక్షల ప్రజా సేవ వాహనాల (పీఎస్‌వీ)కు పోలీసులు తనిఖీ చేసి గుర్తులు జారీ చేశారు. నగరంలోని 1,515 గుర్తింపు పొందిన పాఠశాలల్లో తమ బస్సులను పోలీసులు తనిఖీ చేశారని 582 సంస్థల యజమానులు రవాణాశాఖకు లేఖలు రాశారు. తాము ఎలాంటి రవాణా సదుపాయం కల్పించడం లేదని 764 పాఠశాల యజమానులు పేర్కొన్నారు.
Advertisement