ఢిల్లీకి దీప | deepa meet in president and prime minister tomorrow | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి దీప

Published Thu, Mar 2 2017 3:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

deepa meet in president and prime minister tomorrow

రాష్ట్రప్రతి, ప్రధానిలను కలిసే యత్నం
 జయ మరణంపై ఫిర్యాదుకు సన్నాహం
పేరవైలో నిరసనలు


సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి, ప్రధానిలను కలిసేందుకు దీప సన్నాహాలు సాగిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయి జయలలిత మేనకోడలు రాజకీయ అరంగేట్రంతో మూడుగా మారిపోయింది. రాష్ట్రంలోని 1.5 కోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలను శశికళ, పన్నీర్‌సెల్వం, దీప తలా కొంత పంచుకున్నారు. ముగ్గురి రాజకీయ జీవితాలకు ప్రధాన కారకురాలైన జయలలిత అనుమానాస్పద స్థితిలో మరణించారనే వివాదం నెలకొని ఉంది.

జయ మరణం వెనుక శశికళ కుట్ర దాగి ఉందని కొందరు ఆరోపిస్తుండగా, మరణం వెనుక మర్మాన్ని బైటపెట్టాలని, సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లు లేచాయి. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు ఇటీవల డిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జయ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తమను చుట్టుకున్న వివాదాల నుండి గట్టెక్కెందుకు శశికళ వర్గీయులు సైతం డిల్లీ వెళ్లి వచ్చారు. ఇక మిగిలిన మూడో వర్గం దీప సైతం డిల్లీ బాటపట్టనున్నారు. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన జయలలిత పోయస్‌గార్డెన్‌లోని తన ఇంటిలో స్పృహతప్పిపడిపోయిన స్థితిలోనే ఆసుపత్రిలో చేర్చారని ప్రచారం జరుగుతోంది.

 అయితే జయ స్పృహతప్పడానికి దారితీసిన కారణాలు ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఈ అనుమానాల నివృత్తి కోసమే సీబీఐ విచారణ చేయాలని కొందరు, న్యాయవిచారణ నిర్వహించాలని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో దీప సైతం ఇదే డిమాండ్‌పై డిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కలిసేందుకు అవకాశం దొరికన పక్షంలో జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు.

పేరవైలో నిరసనలు
ఇదిలా ఉండగా,  ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై పేరుతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన దీపకు అప్పుడు తలనొప్పులు మొదలైనాయి. దీప పేరవై కార్యవర్గ నియామకాలపై నిరసనలు తెలపడం ప్రారంభించారు. దీప పేరవైకి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి.. ఈ మూడు పదవులకు నియమకాలు పూర్తిచేశారు. కార్యదర్శిగా నియమితులైన ఏవీ రాజా...దీప కారు డ్రైవర్‌ కావడంతో నిరసన మొదలైంది. రాజా నియామకాన్ని నిరసిస్తూ గత వారం దీప ఇంటిని ముట్టడించారు. కలైయరసి అనే యువతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహుతి యత్నానికి పాల్పడింది. ఈ పరిణామంతో విస్తుపోయిన దీప తాత్కాలికంగా కార్యదర్శిగా తానే ఉంటానని కార్యకర్తలను శాంతిపజేశారు.

 కార్యవర్గం నియామకాలు వివాదాలు తలెత్తడంతో తాత్కాలింగా వాయిదావేశారు. కాగా, మంగళవారం మరికొందరు కార్యకర్తలు దీప ఇంటిని ముట్టడించి తమ అభిప్రాయాలను స్వీకరించాల్సిందిగా కోరారు. అయితే వారు దీపను కలుసుకునే అవకాశం కలగలేదు. దీప భర్త వారిని సముదాయించే ప్రయత్నం చేయగా, కౌన్సిలింగ్‌ విధానం ద్వారా కార్యవర్గాన్ని నియమించాలని కోరారు. పేరవై ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కార్యకర్తల మద్య ఘర్షణ వాతావరణం తలెత్తడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement