కాంగ్రెస్‌కు ‘చీపురు’ దెబ్బ
Published Mon, Dec 9 2013 12:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూకటి వేళ్లతో సహా పెకిలించాయి. పదిహేనేళ్లు ఢి ల్లీ పీఠాన్ని అధిరోహించిన షీలా సర్కార్‌కి ఆదివారం నాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం ఎదురైంది. 2008లో 43 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. షీలాదీక్షిత్ కనీసం తన స్థానాన్ని సైతం నిలబెట్టుకోలేకపోయారు. పట్టుపట్టి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ 25 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్న ఢిల్లీవాసులు సహజంగానే తమ ఓటుద్వారా నిరసన తెలపడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోమారు టిక్కెట్లు ఇస్తే గెలిచి నిలవొచ్చన్న షీలాదీక్షిత్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు వరుసగా రెండు మూడు పర్యాయాలు పార్టీ పెద్దలు కూడా ప్రచారానికి విముఖత వ్యక్తం చేయడంతో షీలా ప్రభుత్వం దిగిపోక తప్పలేదు. ఢిల్లీలో మంత్రులుగా కొనసాగుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఓటమి పాలుకావడం గమనార్హం. కాంగ్రెస్‌పార్టీ ఓటమిని అంగీకరిస్తూ ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్ వెంటనే తన రాజీనామాను ఎల్‌జీకి పంపారు.
Advertisement