
హోలీ రోజున.. చలానాల పంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకగా.. కొందరి అత్యుత్సాహం వల్ల పోలీసులకు చలాన్ల రూపంలో భారీ మొత్తం వసూలైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5624 మంది నుంచి 5.51 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు పోలీసులు చెప్పారు.
'హోలీ రోజున గురువారం ట్రాఫిక్ పోలీసులు 5624 మంది వాహనదారులకు చలానా వేశారు. మద్యం తాగి వాహనం నడపడం, బైకులపై ముగ్గురు వెళ్లడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం వంటి కేసుల్లో చలానాలు వసూలు చేశాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చలానాల రూపంలో 5.51 లక్షల రూపాయలు వసూలైంది' అని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ ముక్తేష్ చందర్ చెప్పారు. ఇక హోలీ రోజున ట్రాఫిక్ పోలీసులు 1085 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నగరంలో కనీసం 403 ట్రాఫిక్ పోలీసు బృందాలను మోహరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలానాల రూపంలో 9.22 లక్షల రూపాయలు వసూలైనట్టు చెప్పారు. గతేడాది మొత్తం 64.53 కోట్ల రూపాయలను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసినట్టు ముక్తేష్ చందర్ తెలిపారు.